డిజిటల్‌లో తొందరపాటు వద్దు

12 Apr, 2017 03:10 IST|Sakshi
డిజిటల్‌లో తొందరపాటు వద్దు

► ముందుగా వాటిని పూర్తిస్థాయిలో పరీక్షించాలి
► ఆ తర్వాతే యూజర్లకి అందుబాటులోకి తేవాలి
► లేదంటే డబ్బుల భద్రతకు ముప్పు వాటిల్లొచ్చు
► నగదు ఇచ్చే లాభాల్ని వేటితోనూ భర్తీ చేయలేం
► క్యాష్‌ అనేది వాస్తవం.. అది కొనసాగుతుంది
► కరెన్సీ సరఫరా తగ్గిస్తే అసలుకే ముప్పు
► ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌.గాంధీ


దేశంలో డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థల్ని అమల్లోకి తేవటంలో తొందరపాటు వద్దని రిజర్వు బ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నరు ఆర్‌.గాంధీ హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగాన్ని తగ్గించటమే లక్ష్యంగా ఈ డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థల్ని తెస్తున్నారని, కాకపోతే ఈ విషయంలో ఆచితూచి అడుగులేయాల్సి ఉందని చెప్పారాయన. లేని పక్షంలో భద్రత పరమైన ప్రమాదాలు తలెత్తే అవకాశాలున్నట్లు స్పష్టం చేశారు. ‘కుప్పలు తెప్పలుగా డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థలు అమల్లోకి వస్తున్నాయి.

వాటిని వినియోగదారులకు అందించే ముందు పూర్తి స్థాయిలో పరీక్షించాలి. లేనిపక్షంలో భద్రతపరమైన సమస్యలు తలెత్తుతాయి’’ అని బ్లూమ్‌బర్గ్‌ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. క్యాష్‌ అనేది వాస్తవమనీ అది కొనసాగుతుందని అన్నారు. కరెన్సీ సరఫరా తగ్గిస్తే అసలుకే ముప్పని పేర్కొన్నారు.  నవంబర్‌ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని తర్వాత డిజిటల్‌ లావాదేవీలను పెంచడానికి పలు డిజిటల్‌ పేమెంట్‌ సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. వీటి ద్వారా కొంతైనా నగదు వాడకం తగ్గుతుందని ప్రభుత్వపు అంచనా.

వేగం కాదు.. భద్రతే ముఖ్యం..
కరెన్సీ, పేమెంట్‌ సిస్టమ్స్‌ వంటి పలు విభాగాల్లో మంచి ప్రావీణ్యం కలిగిన గాంధీ... కొత్త పేమెంట్‌ ఆప్షన్స్‌ ఆవిష్కరణల్లో తొందరపాటు  సరికాదని హెచ్చరించారు. ‘ఒక పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడానికి చాలా పరీక్షలు చేయాలి. అంతా బాగుందనుకుంటేనే దాన్ని అందుబాటులోకి తేవాలి. తొందరపడొద్దు’ అని పేర్కొన్నారు. నగదు వల్ల కలిగే ప్రయోజనాలను అంత సులభంగా ఇతర సాధనాలతో భర్తీ చేయలేమన్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు వారంతటవారే కాగితపు కరెన్సీకి దూరంగా వెళ్తారని అభిప్రాయపడ్డారు.

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ చాలానే ఉన్నాయ్‌..
కేంద్ర ప్రభుత్వం నుంచి డీమోనిటైజేషన్‌ను ప్రకటన వెలువడిన వెంటనే బాగా లాభపడంది మాత్రం పేటీఎం వంటి ప్రైవేట్‌ వాలెట్‌ సంస్థలు. అటు తర్వాత కేంద్రం కూడా సొంత డిజిటల్‌ పేమెంట్‌ సిస్టమ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్‌లో మోదీ భీమ్‌ యాప్‌ను ఆవిష్కరించారు. ఇది యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఇక ఫిబ్రవరిలో క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత పేమెంట్‌ సిస్టమ్‌ భారత్‌క్యూఆర్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది.

అలాగే బయోమెట్రిక్‌ ఆధారిత ఆధార్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను ‘ఆధార్‌ పే’ను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మోదీ దీన్ని శుక్రవారం ఆవిష్కరించనున్నారు. వీటితోపాటు బ్యాంకులకు కూడా సొంత డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయి. నాన్‌ బ్యాంక్‌ ప్రొవైడర్లు వాలెట్‌ సర్వీసులను ఆఫర్‌ చేస్తున్నాయి. మోదీ శుక్రవారం ప్రారంభించనున్న ఆధార్‌ పే గురించి గాంధీ మాట్లాడుతూ.. ఆధార్‌ను చెల్లింపుల కోసం ఉపయోగించడంలో తప్పులేదన్నారు. అయితే ఆధార్‌ డేటాబేస్, పేమెంట్‌ సిస్టమ్‌ మధ్య ఉన్న దూరంపైనే ఆందోళన ఉందన్నారు. ‘ఒక వ్యక్తిని ఆధార్‌ నెంబర్, బయోమెట్రిక్స్‌ ద్వారా గుర్తుపట్టొచ్చు. అది ఒక సిస్టమ్‌. అలాగే పేమెంట్‌ అనేది వేరొక సిస్టమ్‌. కానీ ఆ రెండు ఒకేసారి సమన్వయంతో పనిచేయాలి. అవి రెండు ఒకే సిస్టమ్‌లో లేవు. ఇదో బలహీతన’ అని వివరించారు.

మరిన్ని వార్తలు