సగంలో ఉండగానే సాగనంపారు: రాజన్‌

31 Oct, 2019 16:37 IST|Sakshi

న్యూఢిల్లీ : బ్యాంకింగ్‌ రంగంలో సమస్యలకు యూపీఎ ప్రభుత్వంతో పాటు అప్పటి ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌లే కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన విమర్శలకు రఘరామ్‌ రాజన్‌ దీటుగా బదులిచ్చారు. 2013 సెప్టెంబర్‌ నుంచి 2016 సెప్టెంబర్‌ వరకూ తన పదవీకాలం సాగగా, ఎక్కువ కాలం బీజేపీ ప్రభుత్వ హయాంలోనే పనిచేశానని గుర్తుచేశారు. బ్యాంకింగ్‌ రంగ ప్రక్షాళనకు తాను చర్యలు చేపట్టి అవి అసంపూర్తిగా ఉండగానే తాను ఆర్బీఐ గవర్నర్‌గా వైదొలిగానని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో తాను కేవలం ఎనిమిది నెలలు పనిచేస్తే ప్రస్తుత ప్రభుత్వం కిందే 26 నెలలు ఆర్బీఐ గవర్నర్‌గా వ్యవహరించానని సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రఘురామ్‌ రాజన్‌ల జోడీ వల్లే ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుత దుస్థితి దాపురించిందని నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇలా స్పందించారు. మరోవైపు ఈ అంశంపై రాజకీయ చర్చకు తాను దిగదలుచుకోలేదని స్పష్టం చేశారు. పటిష్ట ఆర్థిక వృద్ధి కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థల ప్రక్షాళన అవసరమని తాను అదే పనిచేశానని తెలిపారు. ఆర్థిక సంక్షోభానికి ముందు తీసుకున్న రుణాలు పేరుకుపోవడంతో బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరిగాయని, వాటిని ప్రక్షాళన చేసి బ్యాంకులకు తిరిగి మూలధన సమీకరణకు తోడ్పడకుంటే సమస్యలు ఎదురవుతాయని, తాను ఈ ప్రక్రియను చేపట్టి సగంలోనే ముగించాల్సి వచ్చిందని రాజన్‌ చెప్పారు. దేశం ప్రస్తుతం ఆర్థిక మందగమనంలో ఉందని చెబుతూ వృద్ధి రేటును పెంచే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు