పెట్టుబడులు పడిపోవడం ఆందోళనకరం

21 Nov, 2015 02:38 IST|Sakshi
పెట్టుబడులు పడిపోవడం ఆందోళనకరం

ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్
హాంకాంగ్: ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్  శుక్రవారం పేర్కొన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అంశంగా పేర్కొన్నారు. ‘‘వృద్ధికి సంబంధించి ఆందోళన కలిగిస్తున్న అంశం పెట్టుబడులు. ప్రైవేటు పెట్టుబడులు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పెట్టుబడుల సంగతీ అంతే’’ అని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాజన్ అన్నారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, మౌలిక రంగం అభివృద్ధి ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహాన్ని అందిస్తున్న అంశాలుగా వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత వారం బ్రిటన్‌లో మాట్లాడుతూ, దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 40 శాతం పెరిగాయని, ప్రపంచానికి భారత్ పట్ల పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను ఆర్‌బీఐ 7.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. వృద్ధికి ఊతం అందించే క్రమంలో సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో బ్యాంకులకు తానిచ్చే (ఆర్‌బీఐ) స్వల్పకాలిక రుణాలపై  వడ్డీరేటు రెపో 6.75 శాతానికి తగ్గింది.

మరిన్ని వార్తలు