ద్రవ్యలోటు ఆధారిత వృద్ధి సరికాదు

30 Jan, 2016 00:32 IST|Sakshi
ద్రవ్యలోటు ఆధారిత వృద్ధి సరికాదు

ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్
న్యూఢిల్లీ:  ద్రవ్యలోటును పెంచుకుంటూ... అదనపు రుణాలు తీసుకునే ఆర్థిక వ్యవస్థ మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 29న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు.

ద్రవ్య క్రమశిక్షణ నుంచి దూరం జరగడం ఆర్థిక స్థిరత్వానికే ముప్పు తెస్తుందని రాజన్ హెచ్చరించారు. శుక్రవారమిక్కడ సీడీ దేశ్‌ముఖ్ స్మారక ఉపన్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసలే ప్రపంచం ఆర్థిక అనిశ్చితిలో ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాలు దేశాన్ని ఇబ్బందికి గురిచేయరాదన్నారు. ద్రవ్యలోటు పెరగడం వల్ల బాండ్లకు సంబంధించి ప్రభుత్వంపై రుణ భారం పెరగడమే కాకుండా...

భవిష్యత్‌లో ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ విషయంలో సమస్యలను సైతం తెచ్చిపెడుతుందని విశ్లేషించారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ రెండూ కలిసి ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి తగిన చర్యలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

 ప్రయోజనాలను పరిశీలించాలి...
ప్రభుత్వ వ్యయాలు ఆర్థిక వ్యవస్థకు ఎంతమేరకు లాభిస్తాయన్న విషయాన్ని సైతం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని రాజన్ చెప్పారు. ఈ వ్యయాల వల్ల ప్రభుత్వ రుణ భారం పెరగరాదన్నారు. ‘‘కేంద్ర, రాష్ట్రాల మొత్తం ద్రవ్యలోటు 2014లో 7 శాతం ఉంటే... అది 2015లో 7.2 శాతానికి పెరిగింది.

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ అమల్లోకి రానున్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీల పునరుద్ధరణ పథకం ఉదయ్ వల్ల ఆర్థిక భారం మరింత పెరుగుతుంది’’ అన్నారాయన. నిజానికి 2015-16లో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తిలో 3.6%కి తగ్గించాల్సి ఉంది. అయితే ఈ లక్ష్యాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం వాయిదా వేసింది.

లక్యంలో 88 శాతానికి ద్రవ్యలోటు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి (ఏప్రిల్-డిసెంబర్) లక్ష్యంలో 88 శాతానికి చేరింది. 2015-16లో ద్రవ్యలోటు లక్ష్యం రూ.5.55 లక్షల కోట్లు (స్థూల దేశీయోత్పత్తిలో 3.9 శాతం). అయితే డిసెంబర్ ముగిసే నాటికి ఈ మొత్తం రూ.4.88 లక్షల కోట్లకు చేరిందని తాజా గణాంకాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు