రైల్వే టెండర్‌ కేసు: లాలూకు మరో షాక్‌

10 Apr, 2018 18:10 IST|Sakshi

సాక్షి, పట్నా: ఆర్‌జేడీ  చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మరిన్ని కష్టాల్లో చిక్కుకుంది. ఇప్పటికే గడ్డి స్కాంలో ఇరుక్కుని జైలు పాలైన లాలుకు రైల్వూ టెండర్‌​ కేసులో మరో షాక్‌ తగిలింది. మాజీ రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన లాలూ భార్య, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. పట్నాలోని  ఆమె నివాసంలో మంగళవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించింది. దీంతోపాటు  లాలు కుమారుడు తేజ్విని దాదాపు నాలుగు గంటలపాటు ప్రశ్నించినట్టు సమాచారం. నగరంలో దాదాపు 12 ప్రాంతాల్లో సోదాలు  నిర్వమించిన సీబీఐ కొన్ని కీలక పత్రాలను కూడా  స్వాధీనం చేసుకున్నట్టు  తెలుస్తోంది. రైల్వే హోటల్స్‌(ఐఆర్‌సీటీసీ) టెండర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీబీఐ  ఈ సోదాలు నిర్వహించింది.

లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేసిన కాలంలో బీఎన్ఆర్ రాంచీ, బీఎన్ఆర్ పూరీ అనే రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ళను సుజాత హోటల్‌కు చట్ట విరుద్ధంగా కట్టబెట్టినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. వినయ్ కొచ్చర్, విజయ్ కొచ్చర్ యాజమాన్యంలో సుజాత హోటల్ నడుస్తోంది. లాలూ రైల్వేమంత్రిగా ఉన్న 2004-09 మధ్య కాలంలో ఈ హోటళ్ళను కొచ్చర్లకు కట్టబెట్టడానికి తన పదవిని దుర్వినియోగపరచినట్లు సీబీఐ ఆరోపించింది. దీంతో వినయ్ కొచ్చర్, విజయ్ కొచ్చర్  పేర్లతో పాటు ఐఆర్‌సీటీసీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్,  పీకే గోయల్‌, లాలు సన్నిహితులైన ప్రేమ్ చంద్ గుప్తా భార్య సరళ గుప్తా , డిలైట్‌మార్కెటింగ్‌ అధిపతి పేర్లను  కూడా సీబీఐ  కేసులో చేర్చింది. లాలూపై సీబీఐ ఛార్జిషీటు 2017 జూలై 7న నమోదైంది. ఈ హోటళ్ళను కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా అత్యంత విలువైన భూమిని లాలూ స్వీకరించారని తెలిపింది. డిలైట్ మార్కెటింగ్ (లారా ప్రాజెక్ట్స్‌) కంపెనీ అనే బినామీ కంపెనీ పేరుతో ఈ భూమిని స్వీకరించినట్లు ఆరోపించింది.  కాగా దాణా కుంభకోణానికి సంబంధించి పలు కేసుల్లో ఇప్పటికే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైల్‌ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు