మరో రెండు రోజుల్లో స్పెషల్‌ టూరిస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

12 Nov, 2018 20:35 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ ఆధ్వర్యంలో స్పెషల్‌ టూరిస్ట్‌ రైలు పట్టాలెక్కనుంది. ఇండియా శ్రీలంక మధ్య ముఖ్యమైన ప్రదేశాలను కలుపుతూ  శ్రీరామాయణ యాత్ర- శ్రీలంక ఎక్స్‌ప్రెస్‌  టూరిస్టులను అలరించేందుకు సిద్ధంగా  ఉంది.   నవంబరు 14నుంచి  16 రోజుల  యాత్ర మొదలు కానుంది. 

అలనాటి రామాయణ కాలంనాటి దృశ్యాలను కళ్లకు కట్టే అనుభూతిని ప్రజలకు కల్పించేందుకు భారతీయ రైల్వే ఈ సరికొత్త  రైలును పరిచయం చేస్తోంది.  800 సీటింగ్ కెపాసిటీతో  శ్రీ రామాయణ యాత్ర- శ్రీలంక పేరిట శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్‌కు మరో రెండురోజుల్లో  పచ్చ జెండా ఊపేందుకు రైల్వే అధికారులు  సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రత్యేక రైలు ద్వారా  శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య నుంచి కొలంబో దాకా  అద్భుతమైన  ప్రయాణం సాగుతుందని గోయల్‌​ ఇటీవల ట్విటర్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

సందర్శించే ప్రదేశాలు
ఢిల్లీ నుంచి బయల్దేరి  మొదట అయోధ్యలో ఆగుతుంది. ఆ తరువాత హనుమాన్ గఢీ రామ్‌కోట్, కనక భవన్ ఆలయ ప్రదేశాలకు చేరుతుంది. అనంతరం నందిగ్రామ్, సీతామర్హి, జనక్‌పూర్, వారణాసి, ప్రయాగ్, శ్రింగ్‌వర్‌పూర్, చిత్రకూట్, నాసిక్, హంపి ద్వారా రామేశ్వరం  చేరుతుంది.

ట్రావెల్ ప్యాకేజ్
సమయం: 16 రోజులు
ప్యాకేజ్ ధర: ఒక్కొక్కరికి రూ. 15,210,
భోజనం, వసతి సదుపాయాలు ఇందులో భాగం.


అయితే శ్రీలంక వెళ్లాలనుకొంటే..  ఒక్కొక్కరూ ప్రత్యేక ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది.

శ్రీలంక ప్రయాణం
శ్రీలంకలోని క్యాండీ, నువారా ఎలియా, కొలంబో, నెగోంబోల మీదుగా కూడా ప్రయాణం సాగుతుంది. అయితే ఇందుకు  రూ. 36,970లు అదనం. కాగా శ్రీలంకను ఈ  ప్రాంతాల్లో సందర్శించాలనుకునే పర్యాటకులు చెన్నై నుంచి కొలంబోకు విమానంలో ప్రయాణించాల్సి ఉంటుందని భారతీయ  రైల్వే వెల్లడించింది.

మరిన్ని వార్తలు