రైల్వే ఆఫర్‌ : 80 లక్షల మందికి ఉచిత వై-ఫై

22 Jun, 2018 15:20 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశీయ రైల్వే స్టేషన్లన్నీ వైఫై హంగులను సమకూర్చుకుంటున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న 700కి పైగా స్టేషన్లలో ఉచిత పబ్లిక్‌ వై-ఫై సర్వీసులను ఆఫర్‌ చేస్తున్నట్టు దేశీయ రైల్వే ప్రకటించింది. ఇది ప్రతి నెలా 80 లక్షల మంది ప్రజలను కవర్‌ చేయనుంది. టెక్‌ దిగ్గజం గూగుల్‌తో కలిసి, దేశీయ రైల్వే ఈ సర్వీసులను ఆఫర్‌ చేస్తోంది. ‘రైల్‌ టెల్‌, అన్‌కనెక్టెడ్‌ను కనెక్ట్‌ చేయాలని అంకిత భావంతో ఉంది. 700 ప్లస్‌ రైల్వే స్టేషన్లలో రైల్‌వైర్‌ హాట్‌స్పాట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీంతో నెలకు 80 లక్షల మంది ప్రజలకు ఈ ఉచిత వై-ఫై అనుభవాన్ని అందించనున్నాం’ అని దేశీయ రైల్వే టెలికాం సంస్థ రైల్‌టెల్‌ ట్వీట్‌ చేసింది. ఈ సర్వీసులను 30 నిమిషాల పాటు ఉచితంగా అందిస్తామని, ఒక్కో సెషన్‌పై సగటున 350 ఎంబీ డేటాను యూజర్లు వాడుకోవచ్చని తెలిపింది.

నెలవారీ డేటా వినియోగం ఈ ఉచిత నెట్‌వర్క్‌పై 7000 టీబీలకు పైగా నమోదవుతుందని పేర్కొంది. ఈ సర్వీసులు ప్రస్తుతం 407 అర్బన్‌ రైల్వే స్టేషన్లు, 298 రూరల్‌ స్టేషన్లలలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ స్టేషన్లలో ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, బిహార్‌, చండీగఢ్‌‌, చత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, గుజరాత్‌, గోవా, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌, జార్ఖాండ్‌, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, నాగాలాండ్‌, ఒడిశా, పంజాబ్‌, రాజస్తాన్‌, తెలంగాణ, త్రిపుర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌లు ఉన్నాయి. 2016 జనవరిలో ముంబై నుంచి తొలుత ఈ సర్వీసులను దేశీయ రైల్వే ప్రారంభించింది. ఈ స్కీమ్‌ కింద లాంచ్‌ అయిన ఏడాదిలో 100 స్టేషన్లను కవర్‌ చేసింది. 6వేలకు పైగా స్టేషన్లలో ఈ ఉచిత వై-ఫై సర్వీసులను రైల్వే విస్తరిస్తుందని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు