2 లక్షల ఉద్యోగాలు..త్వరలో

23 Aug, 2017 16:33 IST|Sakshi
2 లక్షల ఉద్యోగాలు..త్వరలో

సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రమాదాలు, రైల్వే భద్రతపై పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో రైల్వేలో భారీగా ఉద్యోగాల కల్పనపై రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టిపెట్టింది.  వచ్చే కొద్ది సంవత్సరాల్లో  భారీ ఎత్తున ఉద్యోగాలను నియమించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. భద్రతా సంబంధిత ఉద్యోగాలు16 శాతం ఖాళీగా ఉండటంతో   రైల్వే ట్రాక్‌ల  నియంత్రణ, పెట్రోలింగ్‌  కష్టంగా మారడంతో  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రపంచంలోని నాలుగవ అతిపెద్ద రైలు నెట్‌ వర్క్‌ భారతీయ రైల్వే ఇటీవల  ప్రమాదాలపై సీరియస్‌గా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా చర్యలను పెంచడానికి యోచిస్తోంది.   వచ్చే కొన్ని ఏళ్లలో సుమారు  2లక్షలమంది నియమించుకోనుంది.  రాబోయే రోజులలో  భద్రత మరియు నిర్వహణ విభాగంలో భారీగా  పోస్టులను భర్తీ చేయనుందని రైల్వే సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.  దీంతో రైల్వే మొత్తం ఉద్యోగుల  సంఖ్య దాదాపు 15 శాతం భారీ జంప్  చేసిన  1.5 మిలియన్లకు చేరనుంది. మరోవైపు ఇటీవలి కాలంలో  చోటుచేసుకున్న రైలు ప్రమాదాలకు  నైతిక బాధ‍్యత వహిస్తూ ఇప్పటికే రైల్వే బోర్డు  ఛైర్మన్‌ ఎ.కె. మిట్టల్‌  రాజీనామా చేశారు.  అటు రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు మంత్రిపదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు.   ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి  నివేదించారు.

కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వేశాఖ రూ .15వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది.  2016 డిశెంబర్‌ నాటి గణాంకాల ప్రకారం  రైల్వే ఉద్యోగాల సంఖ్య 1.3 మిలియన్లుగా ఉండగా,  గ్రూప్ 'సి', గ్రూప్ 'డి' విభాగాల్లో 225,823 ఖాళీలున్నాయి. గత మూడు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం సగటున 115 రైలు ప్రమాదాలుచోటు చేసుకోగా కనీసం 650 మంది మరణించారు. ఈ  ప్రమాదాల్లో ఎక్కువ మానవరహిత  రైల్వే  క్రాసింగ్‌ లవద్దే జరుగుతున్నాయి. గత శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా ఖతౌలి వద్ద పూరీ–హరిద్వార్‌ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో కనీసం 21 మంది మరణించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు