రెయిన్‌ ఇండస్ట్రీస్‌- కేపీఐటీ టెక్‌.. స్పీడ్‌

29 May, 2020 11:43 IST|Sakshi

రెయిన్‌- క్యూ1 ఫలితాలు భేష్‌

షేరు 13 శాతం హైజంప్‌

కేపీఐటీ- సీఎల్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌

5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌

స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా కాల్సైన్‌డ్‌ పెట్రోలియం కోక్‌ తయారీ కంపెనీ రెయిన్‌ ఇండస్ట్రీస్‌, సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్ల సంస్థ కేపీఐటీ టెక్నాలజీస్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

రెయిన్‌ ఇండస్ట్రీస్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో రెయిన్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 13 శాతం దూసుకెళ్లింది. రూ. 79 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 81ను అధిగమించింది. క్యూ1(జనవరి-మార్చి)లో రెయిన్‌ నికర లాభం 55 శాతం జంప్‌చేసి రూ. 106 కోట్లను దాటింది. అయితే అమ్మకాలు 9 శాతం క్షీణించి రూ. 2898 కోట్లకు పరిమితమయ్యాయి. ఇబిటా 24 శాతం ఎగసి రూ. 460 కోట్లను తాకింది. కంపెనీ జనవరి-డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. గత వారం రోజులుగా ఈ కౌంటర్‌ నిలకడను చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. నేటి ట్రేడింగ్‌లో తొలి అర్ధగంటలోనే 3 లక్షల షేర్లు చేతులు మారినట్లు తెలియజేశారు. గత ఐదు రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 57,000 షేర్లేకావడం గమనార్హం!

కేపీఐటీ టెక్నాలజీస్‌
సీఎల్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తాజాగా కంపెనీకి చెందిన దాదాపు 20 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు కేపీఐటీ టెక్నాలజీస్‌ పేర్కొంది. షేరుకి రూ. 46.91 ధరలో వీటిని సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో అమ్మకందారులు కరువుకావడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కేపీఐటీ టెక్‌ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 49.25 వద్ద ఫ్రీజయ్యింది. గత ఐదు రోజుల్లోనూ 20 శాతం ర్యాలీ చేసింది. కాగా.. గతేడాది క్యూ4లో కేపీఐటీ టెక్నాలజీస్‌ నికర లాభం 23 శాతం ఎగసి రూ. 38 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 11 శాతం వృద్ధితో రూ. 501 కోట్లను తాకింది. 

మరిన్ని వార్తలు