-

ఈ పాలసీలు... వర్షాలకు పనికొస్తాయ్‌

26 Jun, 2017 00:41 IST|Sakshi
ఈ పాలసీలు... వర్షాలకు పనికొస్తాయ్‌

డెంగీ, మలేరియా తరహా వ్యాధులకు ప్రత్యేక పాలసీలు
మోటారు వాహనాలకూ వర్షాలతో నష్టమే
తక్కువ ప్రీమియంతోనే వీటికి కవరేజీ


వర్షాకాలం వ్యాధుల సీజన్‌. దోమల సంతతి బాగా పెరిగేది ఈ కాలంలోనే. వీటికి తోడు వైరస్‌ల రూపంలో ఎన్నో వ్యాధులు తరుముకొస్తుంటాయి. ఈ సమయంలో ఆస్పత్రి పాలైతే బిల్లు కూడా భారీగానే ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా దెబ్బతీసే కొన్ని వ్యాధులకు ప్రత్యేకమైన పాలసీలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే, వర్షాకాలం మోటారు వాహనాలకు కూడా నష్టాలు తెచ్చే కాలమే. ఈ తరహా నష్టాల నుంచి రక్షణ కల్పించేందుకు మోటారు వాహన పాలసీలు సైతం ఉన్నాయి.

పెరుగుతున్న డెంగీ, మలేరియా క్లెయిమ్‌లు
ఏటా వర్షకాలంలో డెంగీ కేసులు చెప్పుకోతగ్గ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. బీమా కంపెనీలకొచ్చే డెంగీ క్లెయిమ్‌లు కూడా పెరిగిపోతున్నాయి. ఒక్క ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ వరకే చూసుకుంటే 2013–14లో 34 క్లెయిమ్‌లు రాగా, 2016–17లో వీటి సంఖ్య 943కు పెరిగింది. మలేరియా, డెంగీ లేదా మరొకటి కావచ్చు... ఈ తరహా ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయని, వీటికి సంబంధించి క్లెయిమ్‌లు కూడా పెరిగిపోతున్నాయని బీమా కంపెనీలు చెబుతున్నాయి.

అసలు డెంగీ, మలేరియా తదితర వ్యాధులక్కూడా సాధారణ ఆరోగ్య బీమా పాలసీలు కవరేజినిస్తుంటే ప్రత్యేకమైన పాలసీల అవసరమేంటన్న సందేహం రావచ్చు. కవరేజి ఉంటుంది కానీ... వీటికి కనీసం 24 గంటల పాలు ఆస్పత్రిలో చేరాలి వంటి నిబంధనలుంటాయి. ఔట్‌ పేషెంట్‌ విభాగంలో వైద్య సలహా పొంది మందులతో చికిత్స తీసుకుంటే ఈ తరహా పాలసీలద్వారా పరిహారం దక్కదు. అటువంటి సమయాల్లో విడిగా ప్రత్యేకమైన వ్యాధులకు కవరేజినిచ్చే పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయి. వైద్య బీమా పాలసీల్లో కొన్ని ఔట్‌ పేషెంట్‌ చికిత్సలకూ కవరేజి ఇస్తున్నాయి. ఒకవేళ మీరు ఈ తరహా పాలసీ తీసుకుని ఉంటే విడిగా ప్రత్యేక పాలసీ
అవసరం పడదు.

డెంగీ కేర్‌
అపోలో మ్యునిచ్‌ ‘డెంగీ కేర్‌’ పాలసీ డెంగీ కారణంగా ఆస్పత్రి పాలైతే రూ.50,000 వరకు... ఔట్‌ పేషెంట్‌గా తీసుకునే చికిత్సలకు రూ.10,000 వరకు పరిహారం చెల్లిస్తోంది. ప్రీమియం రూ.444 మాత్రమే. ఏ వయసు వారికైనా ఇంతే. వయసు, ఇతర అంశాల ఆధారంగా ప్రీమియంలో మార్పు లేదు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కన్సల్టేషన్‌ ఫీజులు, ఇంట్లో తీసుకునే నర్సింగ్‌ సేవలు, ఫార్మసీ వ్యయాలకు పరిహారాన్ని గరిష్ట బీమా పరిమితి మేరకు చెల్లిస్తుంది. ఆస్పత్రిలో షేర్డ్‌ రూమ్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే వైద్యేతర వ్యయాలను కూడా చెల్లిస్తుంది. రూ.లక్ష కవరేజీ పాలసీని కూడా అందిస్తోంది. దీనికి ప్రీమియం రూ.578.

 డెంగీ షీల్డ్‌
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ డెంగీ షీల్డ్‌ కవరేజి కూడా ఇలాంటిదే. డెంగీ ఫీవర్‌ వచ్చిందని పరీక్షల్లో నిర్ధారణయితే ఏకమొత్తంగా పరిహారాన్ని చెల్లించేస్తుంది. ప్లేట్‌లెట్‌ కౌంట్‌ 1,00,000 కంటే తక్కువకు పడిపోవడం, హెమటోక్రిట్‌ సాధారణ స్థాయికి 20 శాతానికి పైగా పెరిగిపోవడం, డెంగీ వచ్చినట్టు ఫిజీషియన్‌ నిర్ధారించడం వంటి కొన్ని షరతులకు లోబడి పరిహారం చెల్లిస్తుంది. అదే సమయంలో కనీసం 48 గంటల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాలన్న షరతులు కూడా ఉన్నాయి. రూ.25,000 కవరేజికి ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటే ప్రీమియం రూ.365. ప్రత్యేకమైన ఈ తరహా పాలసీలు చౌకగా ఉండడంతోపాటు పరిహారం కోసం క్లెయిమ్‌ ప్రక్రియ సులభంగా ఉంటుందనేది డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా ఎండీ అనూప్‌పబ్బి మాట.

వాహనాలకు వర్షాకాల బీమా
వర్షాకాలంలో రహదారులు చెరువుల మాదిరిగా కనిపించే దృశ్యాలు నగరాల్లోని వారికి అనుభవమే. రోడ్లపై రెండు మూడు అడుగుల మేర నీరు ప్రవహించడం వల్ల వాహనాల ఇంజన్లలోకి నీరు వెళ్లి నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక, భారీ గాలి వాన సమయాల్లో చెట్లు విరిగి వాహనాలపై పడితే... వర్షంలో ముం దున్న వాహనం సరిగా కనిపించక వెనుక నుంచి ఏ కారో, లారీయో వచ్చి  ఢీకొట్టడం వల్ల కూడా వాహనానికి నష్టం ఏర్పడొచ్చు. నిజానికి ఈ తరహా క్లెయిమ్స్‌ బీమా కంపెనీలకు ఎక్కువగా వస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో ఇంజన్‌ ప్రొటెక్ట్‌ అక్కరకు వస్తుంది. కాకపోతే ఇందులో కొన్ని షరతులు కూడా ఉంటాయి. వాహనం పూర్తిగా నీటిలో మునిగి ఇంజన్‌ ఆగిపోతే... స్టార్ట్‌ చేసేందుకు ప్రయత్నించకూడదు. దీనివల్ల ఇంజన్‌ దెబ్బతిని పూర్తిగా మార్చాల్సి వస్తుంది. ఇది భారీ వ్యయంతో కూడుకున్నది. అందుకే ఈ షరతులను కంపెనీలు విధిస్తుంటాయి. వర్షపు నీరు కారణంగా ఇంజన్‌కు, ఇంజన్‌ భాగాలకు వాటిల్లే నష్టానికి ఇంజన్‌ ప్రొటెక్ట్‌ పాలసీలో పరిహారం లభిస్తుంది. ఈ పాలసీకి ప్రీమియం వాహనం విలువలో 0.2 శాతం నుంచి 1 శాతం వరకు ఉంటుంది. వాహనం వయసు, బ్రాండ్‌ను బట్టి ఎంత శాతమన్నది కంపెనీ నిర్ణయిస్తుంది.

కారు పాడైతే మొత్తం విలువ
వర్షపు నీటిలో మునిగి తిరిగి రిపేర్‌ చేయడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడితే వాహనం కొనుగోలు విలువ ఎంత ఉంటే ఆ మేర చెల్లించే పాలసీలు కూడా ఉన్నాయి.

రహదారిపై ఆగిపోతే...
తరచూ ప్రయాణాలు చేసే వారికి రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ కవరేజి పాలసీ ఉపయుక్తంగా ఉంటుంది. వాహనం ఉన్నట్టుండి ఆగిపోతే, ఆ ప్రదేశానికే వచ్చి సర్వీస్‌ అందించడం ఇందులోని సౌలభ్యత. బ్యాటరీ జంప్‌స్టార్ట్, టైర్‌ మార్పిడి, ఇంధనం నింపడం తరహా సేవలూ పొందొచ్చు. అక్కడికక్కడే సరి చేయలేని సమస్య అయితే ప్రత్యామ్నాయంగా మరో కారును ఏర్పాటు చేయడం లేదా రిపేర్‌ చేసే వరకూ హోటల్లో విడిది ఏర్పాటు చేయడం వంటి సేవలను అందుకోవచ్చు. కాంప్రహెన్సివ్‌ మోటారు పాలసీలు కొన్ని రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌తో కలిసి వస్తున్నాయి.

ప్రీమియం ఎంత..?
ఉదాహరణకు... హోండా అమేజ్‌ ఈఎంటీ 2016 మోడల్‌కు ఢిల్లీలో ఈడీవీ (ఇన్సూర్డ్‌ డిక్లేర్డ్‌ వ్యాల్యూ) రూ.4,06,324గా ఉంటే, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కాంప్రహెన్సివ్‌ మోటారు ఇన్సూరెన్స్‌ పాలసీలో ఎటువంటి యాడాన్స్‌ లేకుండా రూ.11,423 ప్రీమియం చార్జ్‌ చేస్తోంది. యాడాన్స్‌ కూడా కలిపితే ఇది రూ.14,910 అవుతోంది. రోడ్డు సైడ్‌ అసిస్టెన్స్, జీరో డిప్రీసియేషన్, ఇంజన్‌ ప్రొటెక్ట్‌ అన్నవి యాడాన్స్‌. అదే బజాజ్‌ అలయాంజ్‌లో అయితే యాడాన్స్‌ లేకుండా ప్రీమియం రూ.13,117 కాగా, యాడాన్స్‌ కూడా కలుపుకుంటే రూ.17,567కు పెరుగుతోంది.

మరిన్ని వార్తలు