శిల్పాశెట్టికి కూడా ‘మిర్చి’ సెగ

30 Oct, 2019 11:33 IST|Sakshi

 ఈడీ ముందుకు రాజ్‌ కుంద్రా

త్వరలోనే శిల్పాను ప్రశ్నించనున్న ఈడీ

సాక్షి,ముంబై:  గాంగ్‌స్టర్‌ ఇక్బాల్‌ మిర్చి మనీ లాండరింగ్‌ కేసులో వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా ఈడీ ముందు హాజరయ్యారు. ఈ  కేసులో విచారణకు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో బుధవారం ఆయన  ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే నవంబరు 4న హాజరుకావాలని ఈడీ ఆదేశించగా, ముందస్తుగానే  ఈడీకి ముందుకు రావడం విశేషం. ప్రస్తుతం రాజ్‌కుంద్రాను ప్రశిస్తున్న ఈడీ, ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేయనుంది. అంతేకాదు త్వరలోనే ఈ కేసులో శిల్పా ను కూడా ఈడీ ప్రశ్నించనుందని సమాచారం.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రపంచ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు ప్రధాన అనుచరుడిగా చెప్పుకునే గాంగ్‌స్టర్‌ ఇక్బాల్‌ మిర్చి (2013లో చనిపోయాడు), కుటుంబంపై ఆర్థిక ఆరోపణల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ముంబైలో ఖరీదైన రియల్ ఎస్టేట్ ఆస్తుల కొనుగోలు, అమ్మకంలో అక్రమ లావాదేవీలపై దర్యాప్తు చేస్తోంది. అలాగే ఈ కేసుకు సంబంధించి  మిర్చి కుడిభుజంగా భావించే రంజీత్ సింగ్ బింద్రా, బాస్టియన్ హాస్పిటాలిటీ సంస్థతో కుంద్రా చేసిన లావాదేవీలను కేంద్ర దర్యాప్తు సంస్థ పరిశీలిస్తోంది. ఇటీవల వీరిద్దరి మధ్య కొన్ని వ్యాపార లావాదేవీలపై కీలక సమాచారం నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఈ కేసులో  దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ, అక్టోబర్ 11న  బింద్రాను అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్ కస్టడికి తరలించింది. దర్యాప్తులో భాగంగా రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్‌కెబ్ల్యు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య లావాదేవీలను ఈడీ గుర్తించింది. ఇందులో ఒక డైరెక్టర్‌గా ఉన్న శిల్పాశెట్టి ఆర్‌కెబ్ల్యుద్వారా బాస్టియన్ హాస్పిటాలిటీలో పెట్టుబడులు, వడ్డీ లేని రుణాలు మంజూరు వ్యవహారంలో ఆమెను ఈడీ  ప్రశ్నించనుంది.  అయితే ఈ వ్యాపార వ్యవహారాలలో ఎటువంటి తప్పు చేయలేదని కుంద్రా గతంలో ఖండించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు