ఆర్థిక మంత్రి జైట్లీతో రాజన్ భేటీ

28 May, 2015 00:57 IST|Sakshi
ఆర్థిక మంత్రి జైట్లీతో రాజన్ భేటీ

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో బుధవారం ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ భేటీ అయ్యారు. జూన్ 2 పాలసీ సమీక్ష నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించి వీరిద్దరిమధ్యా విస్తృత స్థాయిలో చర్చ జరిగిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘మేము పలు అంశాలపై చర్చించుకున్నాము’ అని సమావేశం అనంతరం విలేకరులతో రాజన్ అన్నారు.   
 
రేట్ల కోత... కేంద్రం కోరిక!
ద్రవ్యోల్బణం రేటు కట్టడిలో ఉన్నందున రేట్ల కోత నిర్ణయం ద్వారా వృద్ధికి ఊతం ఇవ్వాలని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ మంగళవారం ఆకాంక్షించిన నేపథ్యంలో ఈ అంశంపై ఆసక్తి మరింత పెరిగింది. సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదయినప్పటికీ, తగిన ఆహార నిల్వలు ఉన్నాయని ఆయన పేర్కొంటూ... ఇది ద్రవ్యోల్బణాన్ని భవిష్యత్తులో కట్టడిలో ఉంచే అంశమని అన్నారు.  గత వారం ఆర్థిక మంత్రి సైతం రేట్ల కోత ఆకాంక్షను వ్యక్తం చేశారు. రేట్ల కోతకు ఇది తగిన సమయమని అన్నారు.
 
అసోచామ్, సిటీగ్రూప్ అంచనా అదే...
కాగా రానున్న 2వ తేదీన రెపోరేటు పావుశాతం తగ్గింపు నిర్ణయం ఆర్‌బీఐ తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని అసోచామ్, సిటీగ్రూప్‌లు వ్యక్తం చేశా యి. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ దిశలో నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ వ్యక్తం చేశారు. ఈ ఏడాది 50 బేసిస్ పాయింట్ల రెపో కోత ఉంటుందని భావిస్తున్నట్లు కూడా తెలిపారు.

కొనుగోలు శక్తి తక్కువగా ఉండి డిమాండ్ తగ్గడం, పారిశ్రామిక ఉత్పత్తి, చమురుయేతర ఎగుమతులు, రుణ వృద్ధి అంశాల్లో ప్రతికూలతలతో పాటు ద్రవ్యోల్బణం తగిన స్థాయిల్లో ఉండడం రేట్ల కోత అంచనాలకు బలాన్నిస్తున్న అంశాలని సిటీగ్రూప్ పరిశోధనా నివేదికలో సంస్థ ఇండియా ఎకనమిస్ట్ అనురాగ్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు