అనిశ్చితి నిరోధానికి అసాధారణ చర్యలు

23 Aug, 2019 10:18 IST|Sakshi

ఆర్థిక మందగమనంపై నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌

ఫైనాన్షియల్‌ రంగంలో ఎన్నడూ లేనంత ఒత్తిడి

ప్రైవేటు రంగంలో ఒకరినొకరు విశ్వసించని స్థితి...

దీని నివారణకు చర్యలు అవసరం

న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనడానికి అసాధారణ చర్యలు అవసరమని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ కేంద్రానికి సూచించారు. ఫైనాన్షియల్‌ రంగంలో ముందెన్నడూ లేనంత తీవ్ర ఒత్తిడి నెలకొందనీ, ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రతకూ ఇదీ ఒక కారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు రంగాన్ని ప్రస్తావిస్తూ, ఈ రంగంలో ఒకరినొకరు విశ్వసించలేని పరిస్థితి నెలకొందన్నారు. పెట్టుబడులు పెట్టడంపై ఆందోళనలూ ఉన్నాయన్నారు. ఆయా భయాలను పోగొట్టి, పెట్టుబడులకు వారిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు...
70 యేళ్లలో లేనంత ఫైనాన్షియల్‌ రంగంలో ఒత్తిడి ఉంది. ఎవరు ఎవ్వరనీ విశ్వసించడంలేదు. ప్రైవేటు రంగంలో రుణాలు ఇవ్వడానికి ఎవ్వరూ సిద్దంగా లేదు. ఎవరికివారు పెట్టుబడులు పెట్టకుండా, ఎవరి డబ్బు వారి దగ్గరే ఉంచుకుంటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తగిన చర్యలు అవసరం.  
ఫైనాన్షియల్‌ రంగంలో ఒత్తిడిని నిరోధించడానికి, 2018–19లో ఐదేళ్ల కనిష్టస్థాయి 6.8 శాతానికి పడిపోయిన వృద్ధిని పెంపొందించడానికి 2019–2020 బడ్జెట్‌లో కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. త్వరలో అవి ఫలాలను అందిస్తాయని విశ్వసిస్తున్నా.  
మందగమనంలోకి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా జారిపోవడానికి ఫైనాన్షియల్‌ రంగం కూడా ఒక కారణం. 2009–2014లో విచక్షణా రహితంగా రుణాలు జారీ చేయడంతో తొలుత ఫైనాన్షియల్‌ రంగంలో సమస్యలు ప్రారంభమైనాయి. తరువాతి కాలంలో ఈ రుణాల్లో అధిక భాగం మొండిబకాయిలు (ఎన్‌పీఏ)గా మారాయి. ఎన్‌పీఏల పెరుగుదలతో బ్యాంకులు తాజా రుణాలు ఇవ్వలేని పరిస్థితి నెల కొంది. బ్యాంకింగ్‌యేతర ఆర్థిక కంపెనీలూ ద్రవ్య లభ్యత సమస్యల్లో పడ్డాయి.  
వస్తు, సేవలకు సంబంధించి ప్రైవేటు రంగానికి  ప్రభుత్వ, ప్రభుత్వ శాఖల నుంచి చెల్లింపులల్లో ఆలశ్యం కూడా మందగమన పరిస్థితులు నెలకొనడానికి ఒక కారణమై ఉండచ్చు. అయితే చెల్లింపుల ప్రక్రియ వేగవంతానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ప్యాకేజీలతో ఆర్థిక వ్యవస్థకు చేటు: సుబ్రమణియన్‌
మందగమనంతో తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న వివిధ రంగాలు.. ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరుతుండటంపై ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ స్పందించారు. ఇలాంటి ప్యాకేజీలు ప్రకటించడం ‘నైతికంగా హాని’ చేస్తాయని, మార్కెట్‌ ఎకానమీకి ఇవి శాపంగా పరిణమిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘1991 నుంచి మనది మార్కెట్‌ ఎకానమీగా మారింది. ఇలాంటి ఆర్థిక వ్యవస్థల్లో కొన్ని రంగాలు వృద్ధి దశలో ఉంటే.. కొన్ని క్షీణ దశలో ఉంటాయి. కొంత క్షీణ దశ ఎదురైన ప్రతిసారీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ప్రజాధనాన్ని వెచ్చించాలని ఆశిస్తే సరికాదు. ఇలాంటి వాటి వల్ల నైతికంగా హాని జరుగుతుంది. లాభాలు వస్తే నావి, నష్టాలు వస్తే మాత్రం అందరూ భరించాలనే ధోరణికి దారి తీస్తుంది. మార్కెట్‌ ఎకానమీ పనితీరుకు ఇలాంటివి శాపంగా పరిణమిస్తాయి‘ అని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. మరోవైపు, విద్యుత్‌ శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గర్గ్‌ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాలే వెలిబుచ్చారు. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చి మార్కెట్‌ నుంచి నిధులను ఖాళీ చేయడం కన్నా.. వడ్డీ రేట్లను తగ్గించి, ప్రైవేట్‌ రంగానికి రుణ లభ్యతను పెంచడమనేవి సరైన విధానాలనే ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఆర్థిక కార్యకలాపాలపై సార్వత్రిక ఎన్నికల ప్రబావం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి గణాంకాలు కొంత తక్కువ స్థాయిలో నమోదు కావొచ్చని చెప్పారు.  

మరిన్ని వార్తలు