పాన్‌ షాపుకన్నా అధ్వానం!!

10 Jul, 2019 05:25 IST|Sakshi
రాహుల్‌ భాటియా, రాకేష్‌ గంగ్వాల్‌

ఇండిగోలో తీవ్రస్థాయిలో గవర్నెన్స్‌ లోపాలు

జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దండి

సెబీకి ప్రమోటర్‌ గంగ్వాల్‌ లేఖ

న్యూఢిల్లీ: దేశీ విమానయాన సంస్థ ఇండిగోలో ప్రమోటర్ల మధ్య వివాదాలు మరింతగా ముదిరాయి. కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలని కోరుతూ కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన రాకేష్‌ గంగ్వాల్‌ తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి లేఖ రాశారు. ఇండిగోలో గవర్నెన్స్‌ లోపాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, దానితో పోలిస్తే కనీసం పాన్‌ షాపు నిర్వహణైనా మెరుగ్గా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థను నేడు అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన విలువలకు తిలోదకాలిచ్చి.. కంపెనీ పక్క దారి పడుతోందని గంగ్వాల్‌ ఆరోపించారు.

మరో ప్రమోటరు రాహుల్‌ భాటియా, ఆయన సంస్థలు సందేహాస్పద లావాదేవీలు జరిపినట్లు పేర్కొన్నారు. చిరకాల మిత్రుడైన భాటియాకు కంపెనీపై అసాధారణ నియంత్రణాధికారాలు కట్టబెట్టేలా షేర్‌హోల్డర్ల ఒప్పందం ఉందని గంగ్వాల్‌ ఆరోపించారు.  ‘సందేహాస్పద లావాదేవీలతో పాటు కనీసం ప్రాథమికమైన గవర్నెన్స్‌ నిబంధనలు, చట్టాలను కూడా పాటించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం సరిదిద్దే చర్యలు తీసుకోవాలి‘ అని లేఖలో పేర్కొన్నారు. దీని కాపీని అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌కు కూడా పంపారు.  

19లోగా వివరణివ్వండి..: రాకేష్‌ గంగ్వాల్‌ చేసిన ఫిర్యాదులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కీలక వివరాలు ఇవ్వాలంటూ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ను ఆదేశించింది. దీనికి జూలై 19 గడువు విధించింది. స్టాక్‌ ఎక్సే్చంజీలకు ఇండిగో ఈ విషయాలు తెలిపింది. సెబీకి గంగ్వాల్‌ రాసిన లేఖ ప్రతి తమకు కూడా అందినట్లు వివరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు స్వల్పంగా నష్టపోయి రూ. 1,565.75 వద్ద క్లోజయ్యింది.

వివాదం ఇదీ..  
ఇండిగో సహవ్యవస్థాపకుడు అయిన గంగ్వాల్‌కు కంపెనీలో 37% వాటాలు ఉన్నాయి. మరో సహవ్యవస్థాపకుడు రాహుల్‌ భాటియా, ఆయన సంబంధ సంస్థల (ఐజీఈ గ్రూప్‌)కు 38% వాటాలున్నాయి. సంబంధ పార్టీల మధ్య సందేహాస్పద లావాదేవీలపై ఇద్దరు ప్రమోటర్ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో అత్యవసర షేర్‌హోల్డర్ల సమావేశం నిర్వహించాలంటూ గంగ్వాల్‌ గతంలో ప్రతిపాదించగా భాటియా దాన్ని తిరస్కరించారు. అసమంజసమైన ఆయన డిమాండ్లను కంపెనీ బోర్డు ఒప్పుకోనందున గంగ్వాల్‌ ఇలాంటివన్నీ చేస్తున్నారంటూ భాటియా ఆరోపించారు. దేశీయంగా అతి పెద్ద ఎయిర్‌లైన్‌ అయిన ఇండిగోకు దాదాపు 49%మార్కెట్‌ వాటా ఉంది.

200 పైచిలుకు విమానాలతో రోజూ 1,400 ఫ్లయిట్స్‌ నడుపుతోంది. భాటియాకు అసాధారణ అధికారాలు కట్టబెట్టేలా షేర్‌హోల్డరు ఒప్పందం ఉన్నప్పటికీ.. సుదీర్ఘ మిత్రత్వం దృష్టిలో ఉంచుకుని, కంపెనీపై  నియంత్రణాపేక్ష పెట్టుకోకుండా అగ్రిమెంటు తాను అంగీకరించానని గంగ్వాల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం భాటియాకు చెందిన ఐజీఈ గ్రూప్‌నకు ఆరుగురిలో ముగ్గురు డైరెక్టర్లను, చైర్మన్, సీఈవో, ప్రెసిడెంట్‌ను నియమించే అధికారాలు ఉంటాయి. ప్రస్తుత చైర్మన్‌ స్వతంత్రతను తాను ప్రశ్నించడం లేదని కానీ స్వతంత్ర చైర్మన్‌ పేరిట జరిపే నియామక ప్రక్రియే సెబీ నిబంధనలను తుంగలో తొక్కేలా ఉందని గంగ్వాల్‌ ఆరోపించారు.  

మరిన్ని వార్తలు