రాకేష్‌ జున్‌జున్‌వాలా 3 సూత్రాలు...!

13 Jul, 2020 15:22 IST|Sakshi

ఇంటి భోజనం రుచిగా ఉన్నప్పుడు బయటి ఆహారం ఎందుకు?

పెట్టుబడులకు ప్రస్తుతం ప్రపంచంలోనే దేశీ స్టాక్స్‌ అత్యుత్తమం

ధృఢ వైఖరి, సొంత ఆలోచన, దీర్ఘకాలం కొనసాగే ఓర్పు కావాలి

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులపై రాకేష్‌ జున్‌జున్‌వాలా సూచనలు

సుమారు నాలుగు దశాబ్దాల నుంచీ స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్టర్‌గా కొనసాగుతూ బిగ్‌బుల్‌గా ప్రసిద్ధి చెందిన రాకేష్‌ జున్‌జున్‌వాలా.. ప్రస్తుతం ప్రపంచంలోనే పెట్టుబడికి దేశీ స్టాక్‌ మార్కెట్లు అత్యుత్తమమంటూ కితాబునిచ్చారు. రాకేష్‌తో ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రారంభించిన పలువురు రుమేనియా రియల్‌ ఎస్టేట్‌, న్యూయార్క్‌ కమోడిటీస్‌ తదితర పెట్టుబడి మార్గాలవైపు దృష్టిసారించిన అంశంపై స్పందిస్తూ.. ఇంటి భోజనం రుచిగా ఉన్నప్పుడు బయటికెళ్లి ఆహారాన్ని తినడమెందుకంటూ సరదాగా ప్రశ్నించారు. పెట్టుబడుల విషయంలో ప్రధానంగా మూడు సూత్రాలను పాటిస్తానంటూ ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇలా చెప్పుకొచ్చారు. తొలుత సొంతంగా ఆలోచించాలి. తదుపరి స్థిరంగా ఒక అభిప్రాయానికి రావాలి. దీర్ఘకాలంపాటు పెట్టుబడులను కొనసాగించాలి. ఇవి చేసేందుకు ధైర్యం, రిస్కు తీసుకోగల సంకల్పం, ధృఢ వైఖరి వంటివి ఉండాలి. ఇందువల్లనే ఇప్పుడుకూడా అత్యధికంగా పతనమైన షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాను. స్టాక్‌ మార్కెట్లో నష్టపోయే రిస్క్‌లూ.. భారీగా లాభపడే అవకాశాలనూ పలుమార్లు చూసినట్లు ఈ సందర్భంగా రాకేష్‌ తెలియజేశారు. గత పెట్టుబడులపై రాకేష్‌ ఇలా వివరించారు..

ఎస్కార్ట్స్‌లో..
గతంలో ఎస్కార్ట్స్‌ యాజమాన్యంపై పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సమయంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు సిద్ధపడ్డాను. కంపెనీ బ్యాలన్స్‌షీట్‌ను పరిశీలించాక నష్ట భయంకంటే లాభార్జనకే అధిక అవకాశాలున్నట్లు విశ్వాసం కలిగింది. యాజమాన్య మార్పిడి జరుగుతోంది. అయితే ట్రాక్టర్ల బిజినెస్‌ మెరుగైన లాభాలు ఆర్జిస్తోంది. ఈ సమయంలో పలువురు ఎస్కార్ట్స్‌లో పెట్టుబడులకు విముఖత చూపారు. 12.5 మిలియన్‌ షేర్లను కొనుగోలు చేశాను. ఐదేళ్లలోనే 10 రెట్లు రిటర్నులు లభించాయి. సొంత యోచనతోపాటు.. దీర్ఘకాలంపాటు కొనసాగగల ఓర్పు, కట్టుబాటు వంటివి స్టాక్స్‌ పెట్టుబడుల్లో కీలకపాత్ర పోషిస్తాయి. పోర్ట్‌ఫోలియో విలువకంటే ఎప్పుడూ 2-4 రెట్లు మించి రుణాలకు వెళ్లలేదు. దేశీయంగా కుటుంబ ఆదాయాల్లో 3-4 శాతం వాటానే స్టాక్స్‌లోకి మళ్లుతుంది. యూఎస్‌లో నమోదయ్యే 33 శాతం పెట్టుబడులతో పోలిస్తే ఇవి బహుతక్కువ.
 

మరిన్ని వార్తలు