వయసు 60- సంపద రూ. 16000 కోట్లు

7 Jul, 2020 13:32 IST|Sakshi

60లో అడుగు పెట్టిన రాకేష్ జున్‌జున్‌వాలా

1985లో స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్టర్‌గా ప్రవేశం

తొలి పెట్టుబడి రూ. 5,000- ప్రస్తుతం కోట్లలో

దేశీ స్టాక్‌ మార్కెట్లలో బిగ్‌ బుల్‌గా పేరొందిన సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్ జున్‌జున్‌వాలా గత వారాంతాన 59 ఏళ్ల వయసును దాటారు. అరవైలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జున్‌జున్‌వాలా పెట్టుబడులు, మార్కెట్లపై అభిప్రాయాలు వంటి అంశాలను ఫోర్బ్స్‌ తదితరాల సహకారంతో ఆంగ్ల మీడియా వివరించింది. ఆ వివరాలు చూద్దాం..

2.2 బిలియన్‌ డాలర్లకు
రాకేష్ 1985లో స్టాక్‌ మార్కెట్లలోకి ప్రవేశించారు. తొలుత రూ. 5,000తో ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రారంభించారు.  తదుపరి విజయవంతమైన ఇన్వెస్టర్‌గా నిలుస్తూ సంపదను పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం రాకేష్ పెట్టుబడుల విలువ 2.2 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 16,400 కోట్లు). తద్వారా దేశీయంగా సంపన్న వ్యక్తులలో 48వ ర్యాంకులో నిలుస్తున్నారు. వెరసి రాకేష్ స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడుల వయసు 35 ఏళ్లకు చేరినట్లు నిపుణులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

తొలి నాళ్లలో
రాకేష్‌ తొలినాళ్లలో చేసిన పలు ఇన్వెస్ట్‌మెంట్స్‌ భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. జాబితా చూద్దాం.. 1998-2015 మధ్య అపోలో హాస్పిటల్స్‌లో పెట్టుబడులు 100 రెట్లు రిటర్నులు ఇచ్చాయి. ఇతర రిటర్నులలో బాటా(1996-2019), బీఈఎల్‌ (1998-2007)90 రెట్లు,  ప్రాజ్‌ ఇండస్ట్రీస్‌(2001-07) 700 రెట్లు, ర్యాలీస్‌ ఇండియా (2004-20) 55 రెట్లు ఉన్నాయి.

జాబితా ఇంకా
2000 ప్రాంతంలో రాకేష్‌ భారీ లాభాలను ఆర్జించిన పెట్టుబడుల్లో బీఈఎంఎల్‌(100 రెట్లు), లుపిన్‌(160 రెట్లు), ఎస్‌సీఐ(1200 శాతం) ప్రస్తావించదగ్గవిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక తాజా పెట్టుబడులను పరిశీలిస్తే.. ఎస్కార్ట్స్‌(2013-20) 20 రెట్లు, టాటా కమ్యూనికేషన్స్‌(2010-20) 200 శాతం లాభాలు ఆర్జించాయి.  ఇక టైటన్‌ అయితే 2005-20 కాలంలో 80 రెట్లు ప్రతిఫలాలను ఇచ్చింది. ఇప్పటికీ టైటన్‌లో రాకేష్‌ పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. 

రెండూ వేరువేరు
గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో ట్రేడింగ్‌- ఇన్వెస్ట్‌మెంట్‌ అనేవి భార్య, శ్రీమతి వంటివని రాకేష్‌ పేర్కొన్నారు. రెండింటినీ సమానంగా మేనేజ్‌ చేయలేము. కనుక విడిగా నిర్వహించడమే మేలు అంటూ వ్యాఖ్యానించారు. ట్రేడింగ్‌ అనేది మొమెంటమ్‌ ఆధారంగా వెంటవెంటనే పూర్తి చేయవలసి ఉంటుందని, ఇన్వెస్ట్‌మెంట్‌ అయితే సొంత ఆలోచనలతో దీర్ఘకాలంపాటు స్థిరంగా చేపట్టవలసి ఉంటుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు