ఈ ర్యాలీ నిలిచేది కాదు!

28 May, 2020 13:44 IST|Sakshi

బ్యాంకు షేర్ల పరుగుపై నిపుణుల అంచనా

బ్యాంకు షేర్లలో రెండు రోజులుగా వచ్చిన భారీ ర్యాలీ నిలబడేది కాదని, వాస్తవంగా ఈ రంగం చాలా తలనొప్పులు ఎదుర్కొంటోందని మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలువురు అనలిస్టులు, బ్రోకరేజ్‌లు ఫైనాన్షియల్‌ స్టాక్స్‌పై నెగిటివ్‌ ధృక్పధం వ్యక్తంచేయడంతో ఈ కౌంటర్లలో షార్ట్స్‌ బాగా పెరిగాయి. దీంతో ఎక్స్‌పైరీ సమయానికి భారీ షార్ట్‌కవరింగ్‌ జరిగింది. పైగా అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్నట్లుండి అప్‌మూవ్‌ వేగంగా రావడం కూడా దేశీయ స్టాకుల ర్యాలీకి దోహదం చేసింది. అయితే ఇతర మార్కెట్లతో పోలిస్తే ఇండియా మార్కెట్‌ ఇంకా వెనుకబడేఉంది. లాక్‌డౌన్‌ పాక్షిక సడలింపు, కొన్ని రంగాల్లో వ్యాపారం పునఃప్రారంభం.. వంటి వార్తలు మార్కెట్లో కొనుగోళ్లకు ప్రేరేపించాయి కానీ ఫైనాన్షియల్స్‌ మౌలికాంశాల్లో పెద్దగా పాజిటివ్‌ మార్పులు రాలేదు. కాకపోతే ఈ రంగం హైబీటా రంగం కాబట్టి పుల్‌బ్యాక్స్‌లో భారీ అప్‌మూవ్స్‌ చూపుతుంది. తాజాగా వచ్చిన అప్‌మూవ్‌ కూడా అలాంటిదేనని నిపుణుల అంచనా. ఇలాంటి ర్యాలీలు సాధారణంగా స్వల్పకాలం అంటే రెండుమూడురోజులుంటాయి. నిజమైన ర్యాలీ రావాలంటే వచ్చే 3-6 నెలల అనంతరం ఫైనాన్షియల్స్‌ ఎలా ప్రవర్తిస్తాయనేది చాలా కీలకం. ఈ పరిస్థితుల్లో గుడ్డిగా బ్యాంకు స్టాకులు నమ్మే కన్నా ఫార్మాలో దిగ్గజాలైన సన్‌ ఫార్మా, అరబిందో వంటి షేర్లను పరిశీలించవచ్చని అనలిస్టులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు