ఈ ర్యాలీ అనూహ్యం- జాగ్రత్త అవసరం!

6 Jun, 2020 14:10 IST|Sakshi

లిక్విడిటీ ఎఫెక్ట్‌- మార్కెట్ల జోరు

ఎమోషన్స్‌ కంటే లాజిక్‌.. కరెక్ట్‌

నిఫ్టీకి 10,450- 10,550 వద్ద రెసిస్టెన్స్‌

జిమీత్‌ మోడీ, శామ్‌కో సెక్యూరిటీస్‌

కోవిడ్‌-19 నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ.. స్టాక్‌ మార్కెట్లు అనూహ్య ర్యాలీ చేస్తున్నట్లు జిమీత్‌ మోడీ పేర్కొన్నారు. ఇందుకు ప్రధానంగా లిక్విడిటీ కారణమవుతున్న్లట్లు తెలియజేశారు. ఈ బాటలో గత వారం సైతం మార్కెట్లు పలువురు నిపుణులను ఆశ్చర్యపరుస్తూ జోరందుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌ మోడీ పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాలలో మార్కెట్లకు దూరంగా ఉండమంటూ లాజిక్‌ హెచ్చరిస్తుంటే.. ఎమోషన్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తాయని వ్యాఖ్యానించారు. ఇతర వివరాలు చూద్దాం..

నిరుత్సాహకర వార్తలు
నిజానికి దేశ సావరిన్‌ రేటింగ్‌ను మూడీస్‌ Baa3కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 40 త్రైమాసికాల కనిష్టం 3.12 శాతం వృద్ధికి పరిమితమైంది. అయినప్పటికీ గత వారం మార్కెట్లు ఆశ్చర్యకరంగా జంప్‌చేశాయి. బిజినెస్‌లను ఒక ట్రెండ్‌ మాత్రమే నడిపిస్తుందిగానీ.. షేర్ల ధరలను మాత్రం పలు ఇతర అంశాలు ప్రభావితం చేస్తుంటాయని సర్‌ జాన్‌ టెంపుల్‌టన్‌ ఏనాడో స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లకు జోష్‌నిస్తున్న అంశం ఒక్కటే.. భారీ లిక్విడిటీ. ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న నిధులు బ్లూచిప్‌ కౌంటర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఇది మార్కెట్లను ఎగదోస్తోంది. వెరసి డిమాండ్‌- సప్లై గ్యాప్‌ మార్కెట్ల స్పీడుకు కారణమవుతోంది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు బ్లూచిప్స్‌ తదుపరి జోరందుకోగల ద్వితీయ శ్రేణి కౌంటర్లవైపు దృష్టి సారించవచ్చు. ఇండెక్స్‌ స్టాక్స్‌లో రన్‌ పూర్తయ్యాక నిధులు వీటిలోకి ప్రవహించే అవకాశముంటుంది. ఇలాంటి సందర్భాలలో పెట్టుబడులకు దిగవద్దంటూ లాజిక్‌ సూచిస్తుంటుంది. అయితే ఎమోషన్స్‌ మాత్రం తొందరపెడుతుంటాయి. అలాంటి సందర్భాలలో లాజిక్‌పైనే ఆధారపడటం ఉత్తమంకాగలదు.

షేర్ల విక్రయం
గత వారం రూ. 53,000 కోట్ల రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ రైట్స్‌ ఇష్యూ విజయవంతంగా ముగిసింది. దీంతో స్వల్పకాలంలో కొంతమేర లిక్విడిటీకి విఘాతం కలిగింది. ఈ బాటలో రైట్స్‌ ద్వారా టాటా పవర్‌ రూ. 2000 కోట్ల సమీకరణ లక్ష్యాలను ప్రకటించగా.. మరోపక్క టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ ప్రమోటర్లు రూ. 8400 కోట్ల విలువైన వాటాను విక్రయించింది. అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో ప్రమోటర్‌ కంపెనీలు స్టాండర్డ్‌ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ రూ. 3200 కోట్ల విలువైన వాటాల అమ్మకాన్ని చేపట్టగా..  ఉదయ్‌ కొటక్‌ రూ. 6940 కోట్ల విలువైన వాటాను విక్రయించారు. క్విప్‌ ద్వారా మరో రూ. 7400 కోట్లను సమీకరించారు.

నిఫ్టీ స్పీడ్‌
విదేశీ ఇండెక్సులతో పోలిస్తే గత రెండు వారాలుగా నిఫ్టీ మెరుగైన ర్యాలీ చేసింది. ఫలితంగా నిఫ్టీ కీలక రెసిస్టెన్స్‌లకు చేరువైంది. సమీపకాలంలో బలహీన సంకేతాలు కనిపించడంలేదు. హైయర్‌ టైమ్‌ చార్టుల ప్రకారం నిఫ్టీ బేరిష్‌గా ఉన్నప్పటికీ 20 వారాల చలన సగటుకంటే ఎగువన కదులుతోంది. ఇది పుల్‌బ్యాక్‌ ర్యాలీకి దారిచూపుతోంది. ఇకపై నిఫ్టీ 10,450- 10,550 పాయింట్ల స్థాయిలో రెసిస్టెన్స్‌ను ఎదుర్కొనే వీలుంది. ఇటీవల వెనకడుగు నుంచి ఇది 61.8 శాతం ఫిబోనకీ రీట్రెస్‌మెంట్‌ స్థాయిగా చెప్పవచ్చు. ఈ స్థాయి నుంచి నిఫ్టీ ఎలా టర్న్‌ అవుతుందన్నది చూడవలసి ఉంది. సమీప కాలంలో స్వల్ప బుల్లిష్‌ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇకపై గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్లలో లిక్విడిటీ పరిస్థితులు ఎలా పరిణమిస్తాయన్నది వేచిచూడవలసి ఉంది. దేశీ స్టాక్ మార్కెట్లపై ఈ ప్రభావం పడే అవకాశముంది. ఎఫ్‌పీఐల పెట్టుబడుల తీరు వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే గరిష్ట స్థాయిలవద్ద ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగే వీలుంది. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది.

మరిన్ని వార్తలు