తయారీ ఎక్కడో చెప్పాల్సిందే

21 Jul, 2020 09:44 IST|Sakshi

ఈ–కామర్స్‌ సంస్థలకు నూతన నిబంధనలు: పాశ్వాన్‌

న్యూఢిల్లీ: ఏ దేశంలో ఉత్పత్తి తయారైందన్న సమాచారాన్ని తప్పనిసరిగా తెలియజేసే విధంగా (ఈ–కామర్స్‌ సంస్థలు/ఆన్‌లైన్‌ వేదికగా విక్రయించేవి) నూతన నిబంధనలు ఈ వారం చివరి నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర మంత్రి పాశ్వాన్‌ తెలిపారు. నిబంధనలు అమలు చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో నమోదైన అన్ని ఎల్రక్టానిక్‌ సంస్థలతోపాటు, విదేశాల నుంచి భారతీయ వినియోగదారులకు ఉత్పత్తులను ఆఫర్‌ చేసే సంస్థలకు కూడా ‘వినియోగదారు పరిరక్షణ నిబంధనలు, 2020’ వర్తిస్తాయని పాశ్వాన్‌ పేర్కొన్నారు.

వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 కింద రూపొందించిన చాలా వరకు నిబంధనలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయని, ఈ– కామర్స్‌ నిబంధనలను వారం చివర్లో నోటిఫై చేయనున్నామని ఆయన తెలిపారు. ప్రత్యక్షంగా విక్రయించే దుకాణాలకు నిబంధనల అమలుకు సమయం పడుతుందన్నారు.  

  • కొత్త నిబంధనల కింద ఉత్పత్తి మొత్తం ధర,  సేవలు, అన్ని రకాల చార్జీలు, రిటర్న్, రిఫండ్, ఎక్సేంజ్, వారంటీ, గ్యారంటీ, చెల్లింపుల విధానాలు, ఫిర్యాదుల పరిష్కారం వివరాలను విడిగా ప్రదర్శించాల్సి ఉంటుంది.  
  • ఉత్పత్తి ఏ దేశంలో తయారైంది, గడువు తీరే తేదీ వివరాలను కూడా ఇవ్వడం వల్ల వినియోగదారులు సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశంగా ఉంది.
  • ఒకవేళ ఆర్డర్‌ చేసిన తర్వాత వినియోగదారుడు మనసు మార్చుకుని దాన్ని రద్దు చేసుకుంటే ఎటువంటి చార్జీలను విధించకూడదు. ఇలా రద్దు చేయడం వల్ల ఈ కామర్స్‌ సంస్థపై చార్జీల భారం పడనప్పుడే ఈ నిబంధన వర్తిస్తుంది.
మరిన్ని వార్తలు