ర్యాన్‌బాక్సీ నష్టం రూ. 1,029 కోట్లు

29 Jan, 2015 01:35 IST|Sakshi
ర్యాన్‌బాక్సీ నష్టం రూ. 1,029 కోట్లు

న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో కంపెనీ రూ.1,029 కోట్ల కన్సాలిడేటెడ్ నికర నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ నికర నష్టం రూ.159 కోట్లుగా ఉంది. అధిక ఉత్పాదక వ్యయాలు, విదేశీ మారకానికి(ఫారెక్స్) సంబంధించిన నష్టాలు కంపెనీని దెబ్బతీశాయి. కాగా, క్యూ3లో ర్యాన్‌బాక్సీ మొత్తం ఆదాయం కూడా 9.5 శాతం దిగజారి రూ.2,859 కోట్ల నుంచి రూ.2,588 కోట్లకు తగ్గింది.

భారత్, రష్యా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా దేశాల్లో అమ్మకాల వృద్ధి మెరుగ్గానే ఉందని.. అయితే, కొన్ని మార్కెట్లలో కరెన్సీల క్షీణతతో ప్రతికూల ప్రభావం పడిందని ర్యాన్‌బాక్సీ సీఈఓ, ఎండీ అరుణ్ సాహ్ని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, సన్ ఫార్మాలో ర్యాన్‌బాక్సీ విలీనం ప్రక్రియ సజావుగానే కొనసాగుతోందని ఆయన తెలిపారు.

ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర బుధవారం బీఎస్‌ఈలో 1 శాతం మేర నష్టంతో రూ.699.75 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు