టాటా.. మాటల తూటా!

4 Jan, 2020 03:32 IST|Sakshi

ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు తప్పు..: రతన్‌ టాటా 

కేసు రికార్డుకు పూర్తి విరుద్ధమని వ్యాఖ్య

మిస్త్రీ పునర్నియామకం ఆదేశాలపై సుప్రీంలో పిటిషన్‌

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా తీసుకోవాలంటూ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన ఆదేశాలతో  మిస్త్రీ, టాటాల మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. తాజాగా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను సవాలు చేస్తూ టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటాతో పాటు టాటా ట్రస్ట్‌లు, గ్రూప్‌ సంస్థలు.. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ‘ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు అసంబద్ధం, తప్పు, కేసు రికార్డుకు పూర్తిగా విరుద్ధం‘ అని రతన్‌ టాటా పిటిషన్‌లో పేర్కొన్నారు. మిస్త్రీని వృత్తిపరంగా మాత్రమే చైర్మన్‌గా నియమించడం జరిగిందే తప్ప.. ఆయన కుటుంబానికి (షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌) టాటా గ్రూప్‌లో అత్యధిక వాటాలు ఉన్నందుకు కాదని స్పష్టం చేశారు. మరోవైపు, సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌కు చెందిన ట్రస్టీలు కూడా వేర్వేరు పిటిషన్లు వేశాయి.

ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పులో హేతుబద్ధత లోపించిందని, చట్టాలపరంగా తీవ్రమైన తప్పిదాలు ఉన్నాయని, తప్పుడు ఊహాగానాల ఆధారంగా ఇచ్చినట్లుగా ఉందని ట్రస్టీలు ఆరోపించారు. అటు గ్రూప్‌ సంస్థ టాటా టెలీ సర్వీసెస్ కూడా మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఎన్‌సీఎల్‌టీలో గానీ ఎన్‌సీఎల్‌ఏటీలో గానీ జరిగిన విచారణలో తాము పాలుపంచుకోలేదని, మిస్త్రీ తొలగింపును సమరి్ధంచుకునేలా వాదనలు వినిపించేందుకు తమకు అసలు అవకాశమే దొరకలేదని పేర్కొంది. అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం)లో ఏకగ్రీవ తీర్మానం ఆధారంగానే మిస్త్రీని తమ సంస్థ డైరెక్టరుగా తొలగించడం జరిగిందని స్పష్టం చేసింది.  మరోవైపు, మిస్త్రీపై తీర్పును సవరించాలంటూ ఎన్‌సీఎల్‌ఏటీలో దాఖలు చేసిన కేసులో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) తన వాదనలు వినిపించింది.  టాటా సన్స్‌ను ప్రైవేట్‌ కంపెనీగా మార్చేందుకు అనుమతులివ్వడంలో తామెలాంటి అవకతవకలకూ పాల్పడలేదని స్పష్టం చేసింది. దీనిపై ద్విసభ్య బెంచ్‌ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 2016లో హఠాత్తుగా ఉద్వాసనకు గురైన మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా తీసుకోవాలంటూ ఎన్‌సీఎల్‌ఏటీ ఇటీవల ఆదేశాలు ఇచి్చన సంగతి తెలిసిందే.  

అధికారమంతా తన దగ్గరే పెట్టుకున్నారు..
టాటా సన్స్‌ చైర్మన్‌ అయిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా.. సొంత కుటుంబ వ్యాపారాన్ని దూరం పెట్టడంలో మిస్త్రీ విఫలమయ్యారని రతన్‌ టాటా ఆరోపించారు.  అంతే గాకుండా ‘అధికారాలన్నీ మిస్త్రీ తన గుప్పిట్లోనే పెట్టుకున్నారు. టాటా సన్స్‌ నిర్వహణలో ఉన్న సంస్థల వ్యవహారాల విషయంలో బోర్డు సభ్యులను దూరంగా ఉంచారు. బలవంతంగా రుద్దే నిర్ణయాలను ఆమోదించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది‘ అని రతన్‌ టాటా విమర్శించారు. గ్రూప్‌ అభ్యున్నతి కోసం కృషి చేసిన తనపై ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పులో నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ తీర్పు ఒక తప్పుడు ఒరవడి సృష్టిస్తుందని, భవిష్యత్‌లో పలు కంపెనీలకు వ్యతిరేకంగా దీన్ని దురి్వనియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  

మిస్త్రీపై ట్రస్టుల తీవ్ర ఆరోపణలు..
టాటా గ్రూప్‌లో మైనారిటీ షేర్‌హోల్డర్ల నోరు నొక్కేస్తున్నారంటూ మిస్త్రీ చేసిన ఆరోపణలపైనా టాటా ట్రస్టులు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. 2006 నుంచి సైరస్‌ మిస్త్రీ టాటా సన్స్‌ డైరెక్టరుగా ఉన్నప్పుడు గానీ, ఆ తర్వాత చైర్మన్‌ అయినప్పుడు గానీ అణచివేత గురించి ఎన్నడూ మాట్లాడలేదని.. ఉద్వాసనకు గురయ్యాకే హఠాత్తుగా వీటిని తెరపైకి తెచ్చారని విమర్శించాయి. ఇక, గ్రూప్‌ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటా.. 1917లో టాటా సన్స్‌ను ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగానే ఏర్పాటు చేశారని ట్రస్టులు పేర్కొన్నాయి. మిస్త్రీ కుటుంబం ఇప్పటిదాకా రూ. 69 కోట్లు పెట్టుబడి పెట్టిందని, 2016 మార్చికి వారి వాటాల విలువ రూ. 58,441 కోట్లకు ఎగిసిందని, 1991–2016 మధ్య రూ. 872 కోట్ల డివిడెండ్లు అందుకున్నట్లు ట్రస్టులు పేర్కొన్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు