మెరుగుపడనున్న కంపెనీల రేటింగ్‌

23 Nov, 2017 00:43 IST|Sakshi

నిర్వహణ లాభం పెరుగుతుంది

టెలికం కంపెనీల అవుట్‌లుక్‌ ప్రతికూలం  

మూడీస్‌ వెల్లడి  

ముంబై: భారత కంపెనీల క్రెడిట్‌ రేటింగ్‌ వచ్చే ఏడాది మెరుగుపడే అవకాశాలున్నాయని అంతర్జాతీయ రేటింగ్‌ కంపెనీ,మూడీస్‌ తెలిపింది. జీఎస్‌టీ సంబంధిత సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతున్నాయని, ఆర్థిక కార్యకలాపాలు మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయని, దీంతో కంపెనీల పరపతి రేటింగ్‌ మెరుగుపడుతుందని మూడీస్‌ పేర్కొంది.  

కంపెనీల స్థూల లాభం 5–6 శాతం వృద్ధి !  
వచ్చే ఏడాది జీడీపీ 7.6 శాతంగా ఉండనున్నదని, ఫలితంగా అమ్మకాలు పుంజుకుంటాయని మూడీస్‌ వైస్‌ ప్రెసిడెంట్, సీనియర్‌ ఎనలిస్ట్‌ కౌస్తుభ్‌ చౌబల్‌ చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యాలు మెరుగుపడటం, కమోడిటీ ధరలు తగిన స్థాయిలోనే ఉండటం, వంటి కారణాల వల్ల 12–18 నెలల కాలంలో భారత కంపెనీల స్ఠూల లాభం 5–6 శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. ఆయిల్, రియల్టీ, వాహన, వాహన విడిభాగాలు, ఐటీ సర్వీసుల కంపెనీలకు నిలకడ అవుట్‌లుక్‌ను ఇస్తున్నామని తెలిపారు. తీవ్రమైన పోటీ కారణంగా ఆదాయం, మార్జిన్లపై ఒత్తిడి నెలకొంటుందని, అందుకని టెలికం కంపెనీలకు మాత్రం ‘ప్రతికూలం’ అవుట్‌లుక్‌ను ఇస్తున్నామని పేర్కొన్నారు.  

రుణ పరిస్థితులు మెరుగుపడతాయ్‌..
వచ్చే ఏడాది పలు కంపెనీలు తమ రుణ పునర్వ్యవస్థీకరణ అవసరాలను సులభంగానే నిర్వహించుకోగలవని చౌబల్‌ వివరించారు. జీఎస్‌టీ పన్ను రేట్లలో మరింతగా సరళీకరణ, ఇతర సంస్థాగత సంస్కరణలు, తదితర అంశాల కారణంగా కంపెనీల నిర్వహణ లాభం పెరుగుతుందని పేర్కొన్నారు. దీంతో కంపెనీల రుణ పరిస్థితులు మెరుగుపడతాయని వివరించారు. ఆస్తుల వేల్యూయేషన్లు మెరుగుపడటం కూడా కొన్ని కంపెనీల రుణ పరిస్థితులు మెరుగుపడటటనికి దారితీస్తుందని పేర్కొన్నారు. అయితే వృద్ధి 6 శాతం కంటే తక్కువగా ఉండటం, కమోడిటీ ధరలు తగ్గడం వంటి ప్రతికూలతలు చోటు చేసుకుంటే మాత్రం కంపెనీల స్థూల లాభాల్లో వృద్ధి తక్కువగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు