సంస్కరణల అమలు కీలకం

26 Aug, 2015 00:25 IST|Sakshi
సంస్కరణల అమలు కీలకం

రేటింగ్ పెంపుపై కేంద్రానికి మూడీస్ స్పష్టీకరణ
- ఆర్థిక పరిస్థితులపట్ల సానుకూలత
న్యూఢిల్లీ:
సంస్కరణలు అమలయితేనే రేటింగ్ అప్‌గ్రేడ్ అవకాశం ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దేశానికి పెట్టుబడులు, రుణాలు వంటి అంశాలు మూడీస్, ఫిచ్, ఎస్‌అండ్‌పీ వంటి ప్రముఖ రేటింగ్ సంస్థలు ఇచ్చే రేటింగ్‌పై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం భారత్‌కు మూడీస్ పాజిటివ్ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’ రేటింగ్ ఇస్తోంది. 2004 నుంచీ ఇదే రేటింగ్‌ను భారత్‌కు కొనసాగిస్తోంది. ఈ రేటింగ్ ‘జంక్’ రేటింగ్‌కు ఒక మెట్టు మాత్రమే పైనుంది.

పెట్టుబడులకు సంబంధించి ‘బీఏఏ 3’ ‘దిగువస్థాయి’ గ్రేడ్‌ను సూచిస్తోంది. ద్రవ్యోల్బణం వంటి కీలక స్థూల ఆర్థిక అంశాలు వచ్చే ఏడాదీ సానుకూల రీతిలో ఉంటాయని భారత్ ఆర్థిక వ్యవస్థపై విడుదల చేసిన విశ్లేషణా పత్రంలో పేర్కొంది. ద్రవ్యోల్బణంసహా ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు వంటి అంశాలు సైతం రేటింగ్ అప్‌గ్రేడ్‌కు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగాల్సిన అవసరం ఉందనీ నివేదిక పేర్కొంది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...
- పాలసీ సంస్కరణల ప్రక్రియ మందగమనం, ఆయా అంశాల్లో వెనుకంజ, బ్యాంకింగ్ రంగం బలహీనంగా కొనసాగడం, విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే, రేటింగ్ అవుట్‌లుక్ ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.
- దిగువ స్థాయిలో చమురు ధరలు, పటిష్ట ద్రవ్య-పరపతి విధానాలు స్థూల ఆర్థిక వ్యవస్థ సమతౌల్యతకు దోహదపడతాయి. కమోడిటీ దిగుమతిదారుగా దేశం ప్రస్తుతానికి చక్కటి ప్రయోజనాలను పొందగలుగుతోంది.
- అంతర్జాతీయంగా కొన్ని ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తినా... దేశీయంగా ఉన్న పటిష్ట డిమాండ్ పరిస్థితులు దేశానికి రక్షణ కవచం

- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7 శాతం ఉన్నా... ఇది ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి.
- ప్రైవేటు రంగంలో ప్రత్యేకించి తయారీ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు రావడానికి ప్రభుత్వం తగిన ప్రయత్నాలు అన్నింటినీ చేస్తోంది. ఇది వృద్ధి రికవరీకి దోహదపడే అంశం. తయారీ రంగం భారీ వృద్ధిలో దేశం విజయవంతమైతే.. ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు తగ్గుతాయి. ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి.
 
వ్యవస్థల పటిష్టత అంతంత మాత్రమే!
భారత్‌లో పలు వ్యవస్థల పటిష్టత కూడా ఒక మోస్తరుగానే ఉందని (మోడరేట్-మైనస్) మూడీస్ తన నివేదికలో పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ, ప్రభుత్వ శాఖల మధ్య తగిన సమతౌల్య త సహా దేశంలో చక్కటి ప్రజాస్వామ్యం ఉందని పేర్కొంది. వ్యవస్థల పరంగా ఇవి పటిష్టంగా ఉంటే... రెగ్యులేటరీ వాతావరణంలో అనిశ్చితి, సత్వర న్యాయం అందని పరిస్థితి, పలు కుంభకోణాలు, ప్రభుత్వ సేవలు అందడంలో సామర్థ్యలోపం వంటివి బలహీనతలని వివరించింది. పటిష్ట వ్యవస్థలు సైతం పెట్టుబడులు, వృద్ధికి సంబంధించి తగిన నిర్వహణాపరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని విశ్లేషించింది.

మరిన్ని వార్తలు