కాల్‌డ్రాప్స్ విషయంలో కఠిన చర్యలు

8 Dec, 2015 05:00 IST|Sakshi
కాల్‌డ్రాప్స్ విషయంలో కఠిన చర్యలు

టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్  టెల్కోల సేవలు మెరుగుపడట్లేదని వ్యాఖ్య...
 న్యూఢిల్లీ:
ప్రైవేట్ టెలికం కంపెనీలు తమ కస్టమర్లను పెంచుకుంటున్నాయే తప్ప అధ్వాన్నంగా ఉంటున్న సేవల నాణ్యతను మెరుగుపర్చుకోవడం లేదని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. మొబైల్ కాల్ డ్రాపింగ్ సమస్య పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నేత నరేశ్ అగ్రవాల్ సోమవారం రాజ్యసభలో దీనిపై లేవనెత్తిన ప్రశ్నకు స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు.
 
  ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్‌గా పరిగణిస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోవాల్సిందిగా టెలికం కంపెనీలను ఆదేశించామని, ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని ప్రసాద్ వివరించారు. ‘నేను కఠినంగా వ్యవహరించే మంత్రిని. సేవలు మెరుగుపడేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటాము’ అని ఆయన తెలిపారు. వొడాఫోన్, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ కంపెనీల చీఫ్‌లు కూడా సమస్యలను అంగీకరించి, సర్వీసులు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చినట్లు ప్రసాద్ చెప్పారు.
 
 దేశవ్యాప్తంగా 18 లక్షల పైచిలుకు ప్రైవేట్ కంపెనీల మొబైల్ టవర్లు ఉండగా, వీటిలో 35,000 టవర్లలో లోపాలు ఉన్నాయని ఒక సర్వేలో గుర్తించినట్లు మంత్రి వివరించారు. వీటిలో 20,000 దాకా టవర్లను సరిదిద్దడం జరిగిందని, మిగతావాటిని సరిచేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా గడిచిన మూడు నెలల్లో ప్రైవేట్ టెల్కోలు 14,000 పైగా కొత్త టవర్లను ఏర్పాటు చేశాయన్నారు. కాల్ డ్రాప్ విషయంలో టెల్కోలపై జరిమానా విధించాలన్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫర్సులు జనవరి నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ను మళ్లీ లాభాల బాట పట్టిస్తానని ఆయన తెలిపారు.
 

మరిన్ని వార్తలు