యస్‌ బ్యాంక్‌ ఎండీగా రవ్‌నీత్‌ గిల్‌ బాధ్యతలు 

2 Mar, 2019 00:52 IST|Sakshi

మూడేళ్ల పాటు పదవీకాలం 

ముంబై: ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా రవ్‌నీత్‌ గిల్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. బ్యాంక్‌ సహ–వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ స్థానంలో ఆయన నియమితులైన సంగతి తెలిసిందే. గిల్‌ పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. ఇప్పటిదాకా జర్మనీ బ్యాంకింగ్‌ దిగ్గజం డాయిష్‌ బ్యాంక్‌ భారత విభాగానికి గిల్‌ సారథ్యం వహించారు. నిర్దిష్ట కారణాలు బహిరంగంగా వెల్లడించనప్పటికీ .. రాణా కపూర్‌ పదవీ కాలాన్ని పొడిగించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ అంగీకరించకపోవడంతో కొత్త ఎండీ నియామకం తప్పనిసరైన సంగతి తెలిసిందే. 2019 సెప్టెంబర్‌ దాకా కపూర్‌ పదవీకాలాన్ని పొడిగించాలంటూ యస్‌ బ్యాంక్‌ కోరినప్పటికీ ఆర్‌బీఐ నిరాకరించింది.

యస్‌ బ్యాంక్‌లో గవర్నెన్స్, నిబంధనల అమలుపరమైన లోపాల ఆరోపణలే రాణా కపూర్‌ ఉద్వాసనకు కారణమై ఉంటాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. 
ఇక, తాత్కాలిక ఎండీగా ఇప్పటిదాకా విధులు నిర్వర్తించిన నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజయ్‌ కుమార్‌.. ఇకపై అదే హోదాలో కొనసాగుతారు. పార్ట్‌ టైమ్‌ చైర్మన్‌ బ్రహ్మదత్, స్వతంత్ర డైరెక్టరు ముకేష్‌ సబర్వాల్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ నాన్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ సుభాష్‌ చందర్‌ కాలియా, స్వతంత్ర డైరెక్టర్‌ ప్రతిమా షోరే.. బోర్డు సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు అదనంగా నలుగురు స్వతంత్ర డైరెక్టర్లు బోర్డులో ఉంటారు.  ఎండీ, సీఈవోగా గిల్‌ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో శుక్రవారం బీఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు 2.68 శాతం పెరిగి రూ. 237.40 వద్ద క్లోజయ్యింది.   

మరిన్ని వార్తలు