రూపాయి చికిత్సకు ఆర్‌బీఐ మరిన్ని చర్యలు

24 Jul, 2013 02:35 IST|Sakshi
Rupee

ముంబై: డాలరుతో రూపాయి మారకం విలువ పతనానికి అడ్డుకట్టవేయడం కోసం రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) మరిన్ని చర్యలను ప్రకటించింది. ప్రధానంగా ద్రవ్యసరఫరా(లిక్విడిటీ)ను ఇంకా తగ్గించేవిధంగా మంగళవారం చర్యలు తీసుకుంది. లిక్విడిటీ అడ్జెస్ట్‌మెంట్ ఫెసిలిటీ(ఎల్‌ఏఎఫ్) కింద బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో ఇప్పటిదాకా 1 శాతానికి సమానమైన నిధులను ఆర్‌బీఐ నుంచి స్వల్పకాలిక రుణాల రూపంలో తీసుకునే వీలుంది. దీన్ని ఇప్పుడు సగానికిసగం తగ్గించి అర శాతానికి పరిమితం చేసింది. ముఖ్యంగా నగదు లభ్యతను కట్టడి చేయడం ద్వారా ఫారెక్స్ మార్కెట్లో భారీ స్పెక్యులేషన్, కరెన్సీ తీవ్ర హెచ్చుతగ్గులను నివారించేందుకే ఆర్‌బీఐ ఈ నిర్ణయాలు తీసుకుంది.
 
 ఎల్‌ఏఎఫ్‌లో మార్పులు నేటి నుంచి(బుధవారం), సీఆర్‌ఆర్ కొత్త నిబంధనలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. మళ్లీ ఉత్తర్వులు జారీచేసేదాకా ఇవి అమల్లో ఉంటాయని పేర్కొంది. ఇటీవలే బ్యాంక్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్) రేట్లను చెరో రెండు శాతం చొప్పున ఆర్‌బీఐ పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు రేట్లు ప్రస్తుతం 10.25 శాతానికి చేరాయి. స్వల్పకాలిక రుణాల వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులను నివారించేందుకు ఆర్‌బీఐ  ఈ ఎంఎస్‌ఎఫ్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం బ్యాంకులు తమ నికర డిపాజిట్లలో ఒక్క శాతం మేర రుణంగా తీసుకోవచ్చు. దీనిపై రేటును పెంచడమే కాకుండా పరిమితిని తగ్గించడం వల్ల బ్యాంకులకు నిధుల లభ్యత తగ్గి... వ్యవస్థలో ద్రవ్యసరఫరా కూడా దిగొస్తుంది.
 
 సీఆర్‌ఆర్ నిర్వహణ కట్టుదిట్టం...
 నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) ప్రకారం బ్యాంకుల డిపాజిట్ నిధుల నిర్వహణను కూడా ఆర్‌బీఐ మరింత కట్టుదిట్టం చేసింది. దీనిలోభాగంగా ఇక నుంచి రోజువారీ ప్రాతిపదికన సగటున బ్యాంకులు 99 శాతం సీఆర్‌ఆర్‌ను పాటించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఈ పరిమాణం 70 శాతంగా ఉంది. తాజా చర్యల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రూ.4,000-5,000 కోట్ల నిధులను ఆర్‌బీఐ వెనక్కి గుంజేసేందుకు వీలవుతుందని సీనియర్ బ్యాంకర్లు పేర్కొన్నారు. దీంతో లిక్విడిటీ మరింత తగ్గేందుకు దారితీస్తుంది. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచే నిధుల పరిమాణాన్ని సీఆర్‌ఆర్‌గా వ్యవహరిస్తారు. ఇది ప్రస్తుతం 4 శాతంగా ఉంది. కాగా, గడిచిన 10 రోజుల వ్యవధిలో రూపాయి క్షీణతకు బ్రేక్ వేయడం కోసం ఆర్‌బీఐ రంగంలోకి దిగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. రూపాయి విలువ ఇటీవలే 60 దిగువకు పడిపోయి కొత్త ఆల్‌టైమ్ కనిష్టాన్ని(61.22) తాకిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ, ప్రభుత్వ చర్యల ప్రభావంతో ఇప్పుడిది 59-60 మధ్య కదలాడుతోంది.
 

>
మరిన్ని వార్తలు