రద్దయిన పెద్ద నోట్ల లెక్క తేలింది

30 Aug, 2017 19:30 IST|Sakshi
రద్దయిన పెద్ద నోట్ల లెక్క తేలింది
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు వివరాలపై ఇన్ని రోజులు నాన్చుతూ వస్తున్న రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆ నోట్ల లెక్క తేల్చింది. ఎన్ని నోట్లు తమ వద్ద డిపాజిట్‌ అయ్యాయో ప్రకటించింది. బుధవారం విడుదల చేసిన వార్షిక రిపోర్టులో 99 శాతం పెద్ద నోట్లు తమ వద్ద డిపాజిట్‌ అయినట్టు ఆర్బీఐ వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు ప్రకటన నుంచి ఇప్పటి వరకు రూ.15.28 లక్షల కోట్ల విలువైన పాత నోట్లు సెంట్రల్‌ బ్యాంకు వద్దకు వచ్చినట్టు పేర్కొంది.
 
2016 మార్చి వరకు చలామణిలో ఉన్న 632.6 కోట్ల వెయ్యి రూపాయిల నోట్లలో, ఇంకా 8.9 కోట్ల వెయ్యి రూపాయిల నోట్లు తమ వద్దకు రాలేదని వెల్లడించింది. అంటే కేవలం 1.3 శాతం వెయ్యి రూపాయిల నోట్ల మాత్రమే వెనక్కి రాలేదని తెలిపింది. తిరిగొచ్చిన పెద్ద నోట్లలో 7 లక్షల 62వేల నకిలీ నోట్లని చెప్పింది.  పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన రూ.2000 నోట్లు, మొత్తం చలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువలో సగం శాతం ఉన్నట్టు ఆర్బీఐ రిపోర్టు బహిర్గతం చేసింది.
 
అంతేకాక 2016-17లో కొత్త కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌కు సెంట్రల్‌ బ్యాంకు రూ.7,965 కోట్లను వెచ్చించినట్టు కూడా వెల్లడించింది. అయితే మార్చి ముగింపు వరకు ఏడాది ఏడాదికి మొత్తంగా చలామణిలో ఉన్న కరెన్సీ వాడకం 20.2 శాతానికి తగ్గిపోయినట్టు ఆర్బీఐ తెలిపింది. తక్కువ విలువ కలిగిన బ్యాంకు నోట్లను ఎక్కువగా మార్కెట్‌లోకి తెస్తుండటంతో, బ్యాంకు నోట్ల వాల్యుమ్‌ మాత్రం 11.1 శాతం పెరిగినట్టు సెంట్రల్‌ బ్యాంకు తెలిపింది. 
 
ఈ ఏడాది వ్యాప్తంగా నాణేలకు ఏర్పడిన డిమాండ్‌లో స్థిరమైన పెరుగుదల కనిపించినట్టు ఆర్బీఐ తన రిపోర్టులో చెప్పింది. నాణేల మొత్తం విలువ సర్క్యూలేషన్‌లో 14.7 శాతానికి పెరిగినట్టు ఆర్బీఐ వెల్లడించింది. కాగ, గతేడాది ఇవి 12.4 శాతం మాత్రమేనని రిపోర్టులో పేర్కొంది. 1, 2 రూపాయిల నాణేలు మొత్తం కాయిన్ల విలువలో 69.2 శాతం ఉంటే, విలువ పరంగా 44.8 శాతం ఉన్నాయి.
 
కాగ, గతేడాది నవంబర్‌ 8న ప్రధాని నరేంద్రమోదీ అకస్మాత్తుగా పెద్ద నోట్లు రూ.1000, రూ.500 రద్దు చేసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిర్దేశించిన గడువు విధించిన ప్రభుత్వం, ఆ నోట్లను బ్యాంకుల వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. వాటి స్థానంలో కొత్త నోట్లను ఆర్బీఐ చలామణిలోకి తీసుకొచ్చింది. నిర్దేశించిన గడువు లోపల బ్యాంకుల వద్ద పాత నోట్లను డిపాజిట్‌ చేయని వారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు కూడా ఆదేశించింది. అవినీతిపై పోరాటానికి, నల్లధన నిర్మూలనకు ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది.