వృద్ధి బాటలో చిన్న మందగమనమే!

30 Aug, 2019 05:57 IST|Sakshi

ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ విశ్లేషణ

సైక్లికల్‌ ఎఫెక్ట్‌గా అభిప్రాయం

2018–19 వార్షిక నివేదిక విడుదల

వినియోగం, ప్రైవేటు పెట్టుబడుల వృద్ధిపై దృష్టి అవసరమని సూచన

ముంబై: భారత్‌ ప్రస్తుత మందగమన పరిస్థితులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తక్కువ చేసి చూపించింది. భారీ వృద్ధికి ముందు చిన్న మందగమన పరిస్థితులను భారత్‌ ఎదుర్కొంటోందని పేర్కొంది. దీనిని సైక్లికల్‌ ఎఫెక్ట్‌ (ఎగువ దిగువ)గా పేర్కొంది. వినియోగం, ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణ కేంద్రం, విధాన నిర్ణేతల అధిక ప్రాధాన్యత కావాల్సిన అవసరం ఉందని వివరించింది. 2018–19 (జూలై–జూన్‌) వార్షిక నివేదికను ఆర్‌బీఐ గురువారం ఆవిష్కరించింది. నివేదికలోని ముఖ్యాంశాలు...

► ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది ఏమిటి అన్నది కచ్చితంగా చెప్పడం కష్టం. అయితే సమస్యలు వ్యవస్థాపరమైనవి కావు. భూ, కార్మిక, వ్యవసాయ ఉత్పత్తి, మార్కెటింగ్‌ రంగాల్లో మాత్రం సంస్కరణలు అవసరం.
► భారీ వృద్ధికి ముందు చిన్న కుదుపా లేక అప్‌ అండ్‌ డౌన్స్‌లో భాగమా? లేక వ్యవస్థాగత మందగమనమా? అన్నది ప్రస్తుతం ప్రశ్న. అయితే భారీ వృద్ధికి ముందు మందగమనం, సైక్లింగ్‌ ఎఫెక్ట్‌ అని మాత్రమే దీనిని చెప్పవచ్చు. తీవ్ర వ్యవస్థాగత అంశంగా దీనిని పేర్కొనలేము.
► వరుసగా నాలుగు ద్వైమాసికాలాల్లో ఆర్‌బీఐ 1.10 శాతం రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.40 శాతం) లక్ష్యం వృద్ధి మందగమన నిరోధమే. 2019–20లో వృద్ధి 6.9 శాతంగా భావించడం జరుగుతోంది.  
► బ్యాంకింగ్, బ్యాంకింగేతర రంగాలను పటిష్టం చేయాలి. మౌలిక రంగ వ్యయాలకు భారీ మద్దతు నివ్వాల్సిన అవసరం ఉంది. కార్మిక  చట్టాలు, పన్నులు, ఇతర న్యాయ సంస్కరణల అంశాల్లో వ్యవస్థాగత సంస్కరణల అమలు అవసరం.  
► దేశీయ డిమాండ్‌ పరిస్థితులు ఊహించినదానికన్నా బలహీనంగా ఉన్నాయి. దీని పునరుద్ధరణకు వ్యవస్థలో తగిన చర్యలు తీసుకోవాలి.  
► వ్యాపార పరిస్థితులు మెరుగుపరచాలి.  
► రైతుల రుణ మాఫీ, ఏడవ వేతన కమిషన్‌ నివేదిక అమలు, వివిధ ఆదాయ మద్దతు పథకాలు ఆర్థిక క్రమశిక్షణా పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఆయా పరిస్థితులతో ఆర్థిక ఉద్దీపన
అవకాశాలకూ విఘాతం.
► ఆర్థిక వ్యవస్థలో సానుకూలతలూ ఉన్నాయి. తగిన వర్షపాతంతో అదుపులో ఉండే ధరలు, ద్రవ్యలోటు కట్టుతప్పకుండా చూసే పరిస్థితులు, కరెంట్‌ అకౌంట్‌ లోటు కట్టడి వంటివి ప్రధానం.  
► బ్యాంకింగ్‌లో వేగంగా విలీనాల ప్రక్రియ.  
► ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ వైఫల్యం నేపథ్యంలో– వాణిజ్య రంగానికి నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) రుణం 20 శాతం పడిపోయింది. 2017–18లో రుణ పరిమాణం రూ.11.60 లక్షల కోట్లు ఉంటే,  2018–19లో ఈ మొత్తం రూ.9.34 లక్షల కోట్లు.  
► అమెరికా–చైనాల మధ్య వాణిజ్య సంబంధ అంశాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇది అంతర్జాతీయ మందగమన పరిస్థితులకు దారితీసి, ఫైనాన్షియల్‌ మార్కెట్లపై సైతం ప్రతికూల ప్రభావం చూపుతోంది.  
► బ్యాంకింగ్‌ మొండిబకాయిలు తగ్గాయి. 2017–18లో మొత్తం రుణాల్లో మొండిబాకాయిలు 11.2 శాతం ఉంటే, ఇది 2018–19లో 9.1 శాతానికి తగ్గాయి.  మొండిబకాయిల సమస్య తగ్గడంలో దివాలా చట్టం కూడా కీలకం.
► బ్యాంక్‌ మోసాల విలువ 2018–19లో రూ.71,543 కోట్లకు చేరాయి. 2017–18 నుంచి చూస్తే ఈ విలువ 73.8 శాతం (రూ.41,167.04 కోట్లు) పెరిగింది. ఇక కేసులు, 15% పెరుగుదలతో 5,916 నుంచి 6,801కి చేరాయి.
► ప్రైవైటు బ్యాంకులు, విదేశీ బ్యాంకుల చీఫ్‌ల వేతనాల విషయంలో సవరించిన నిబంధనలు త్వరలోనే విడుదల.
► యువతకు ఆర్‌బీఐ పట్ల అవగాహన పెంచేం దుకు   ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియా వేదికలను విస్తృతంగా ఉపయోగించుకోవడం.

రూ.1.96 లక్షల కోట్లకు ఆర్‌బీఐ అత్యవసర నిధి
కేంద్రానికి మిగులు నిధులు రూ.52,000 కోట్ల బదలాయింపుల నేపథ్యంలో ఆర్‌బీఐ వద్ద అత్యవసర నిధి రూ.1.96 లక్షల కోట్లకు తగ్గుతోంది. ఆర్‌బీఐ 2018–19 వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. 2019 జూన్‌ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఆర్‌బీఐ గురువారం ఆవిష్కరించింది. మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసులను సోమవారంనాడు ఆర్‌బీఐ బోర్డ్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. బ్యాలెన్స్‌ షీట్‌లో ఆర్‌బీఐ క్యాపిటల్‌ రిజర్వ్స్‌ బఫర్స్‌ పరిమాణం  5.5 నుంచి 6.5 శాతం శ్రేణిలో ఉండాలని కమిటీ సిఫారసు చేసింది.  ఎటువంటి ఆర్థిక సవాళ్లనైనా ఎదుర్కొనగల అత్యున్నత స్థాయి కలిగిన సెంట్రల్‌ బ్యాంకుల్లో ఆర్‌బీఐ ఒకటని 2018–19 వార్షిక నివేదిక పేర్కొంది. 2018 జూన్‌ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ వద్ద అత్యవసర నిధి పరిమాణం రూ. 2,32,108 కోట్లుగా ఉంది. తాజాగా కేంద్రానికి అందివచ్చిన 52,000 కోట్లు ఆర్‌బీఐకి సంబంధించి 2018–19 ఆర్థిక సంవత్సరం లెక్కలో వేస్తే, ప్రభుత్వానికి వచ్చే సరికి ఈ నిధులు 2019–20 ఆర్థిక సంవత్సరానికి అందినట్లు అవుతుంది.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు