సందీప్‌ బక్షి నియామకాన్ని ఆమోదించిన ఆర్‌బీఐ

17 Oct, 2018 00:01 IST|Sakshi

అక్టోబర్‌ 15 నుంచి 3 ఏళ్లు పదవీకాలం

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకుల సీఈఓ ఎంపిక విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ).. ఎట్టకేలకు ఐసీఐసీఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ పదవికి ప్రతిపాదిత సందీప్‌ బక్షి నియామకాన్ని ఆమోదించింది. అయితే, బ్యాంకు బోర్డ్‌ ప్రతిపాదించిన 5 ఏళ్ల పదవీకాలాన్ని పక్కన పెట్టి.. వచ్చే మూడేళ్లు ఈయన బ్యాంకు ఎండీ, సీఈఓగా కొనసాగే విధంగా నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 15 (సోమవారం) నుంచి 3 ఏళ్లు పదవీకాలంతో ఈయన నియామకాన్ని ఆర్‌బీఐ ఆమోదించినట్లు బొంబే స్టాక్‌ ఎక్సే్ఛంజీకి అందించిన సమాచారంలో బ్యాంక్‌ వెల్లడించింది.

అక్టోబర్‌ 3, 2023 వరకు ఈయన పదవీకాలంగా తెలియజేసింది. క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్‌ స్థానంలో.. బ్యాంక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ)గా బాధ్యతలు నిర్వహించిన సందీప్‌ బక్షిని ఎండీగా బోర్డు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 1986లో సీఓఓగా బాధ్యతలు చేపట్టిన ఈయన.. అక్టోబర్‌ 4న చందా కొచర్‌ రాజీనామాతో నూతన పదవికి ఎంపికయ్యారు. తాజా నియామకం అనంతరం ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు మంగళవారం బీఎస్‌ఈలో 2.5 శాతం పెరిగి రూ.321 వద్ద ముగిసింది.
 

మరిన్ని వార్తలు