రేటు కోతకు బలం..!

13 Mar, 2019 00:00 IST|Sakshi

పారిశ్రామిక ఉత్పత్తి  వృద్ధి జనవరిలో 1.7 శాతం

ఆర్‌బీఐ నిర్దేశ పరిధిలోనేఫిబ్రవరి రిటైల్‌ ధరలు

పెరుగుదల స్పీడ్‌ 2.57 శాతం

న్యూఢిల్లీ: వృద్ధికి ఊతం అందించడంలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సరళతర వడ్డీరేట్ల విధానాన్ని కొనసాగిస్తుందనే అంచనాలకు బలాన్నిచ్చే ఆర్థిక గణాంకాలు మంగళవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి  సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు జనవరిలో కేవలం 1.7 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జనవరితో పోల్చితే (అప్పట్లో 7.5 శాతం) వృద్ధి కేవలం 1.7 శాతమన్నమాట. తయారీ, క్యాపిటల్, వినియోగ వస్తువుల రంగాలూ పూర్తిగా నిరాశపరచడం దీనికి కారణం.  కాగా ఫిబ్రవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.57 శాతంగా నమోదయ్యింది. ఇది నాలుగు నెలల గరిష్టస్థాయే అయినప్పటికీ, ఆర్‌బీఐ నిర్దేశాలకు అనుగుణంగా (ప్లస్‌ లేదా మైనస్‌ 2తో 4 శాతం)నే ఉండడం గమనార్హం. ఏప్రిల్‌ 4న జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు. ప్రస్తుతం 6.25 శాతం) మరింత తగ్గిస్తుందన్న అంచనాలకు తాజా గణాంకాలు ఊతం ఇస్తుండడం గమనార్హం. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) తాజా గణాంకాలను మంగళవారం విడుదల చేసింది.  

రంగాల వారీగా  ఉత్పత్తి 
► తయారీ రంగం ఉత్పత్తి వృద్ధి 8.7 శాతం నుంచి (జనవరి 2018) 1.3 శాతానికి (జనవరి 2019) పడిపోయింది.  
►  విద్యుత్‌ ఉత్పత్తి వృద్ధి 7.6 శాతం నుంచి 0.8 శాతానికి పడింది. డిసెంబర్‌లో కూడా ఈ వృద్ధి రేటు దాదాపు 0.8 శాతంగానే ఉంది.  
►  అయితే మైనింగ్‌ రంగంలో మాత్రం కొంత పురోగతి కనిపించింది. వృద్ధి రేటు 0.3 శాతం నుంచి 3.9 శాతానికి పెరిగింది. 
►పెట్టుబడులకు సంకేతమైన భారీ పరిశ్రమలకు సంబంధించిన క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదుచేసుకుంది.  
►ఏప్రిల్‌ నుంచి జనవరి వరకూ 4.4 శాతం  పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు ఏప్రిల్‌ నుంచి జనవరి వరకూ.. 4.1% నుంచి 4.4%కి పెరిగింది. 

రిటైల్‌ ధరల స్పీడ్‌
ఆహార ధరల పెరుగుదల కారణంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 2.57 శాతంగా నమోదయ్యింది. 2018 ఫిబ్రవరిలో ఈ రేటు 4.44 శాతంగా ఉంటే, 2019 జనవరిలో 1.97 శాతంగా నమోదయ్యింది. జనవరిలో అసలు ఆహార ఉత్పత్తుల బాస్కెట్‌ ధర పెరక్కపోగా –2.24 శాతం క్షీణిస్తే, (2018 జనవరితో పోల్చితే)  ఫిబ్రవరిలో 0.66 శాతంగా నమోదవడం గమనార్హం. 2018 నవంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.33 శాతం. తన ద్రవ్య పరపతి విధాన సమీక్షకు ఆర్‌బీఐ రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. n    అక్టోబర్‌ 2018 తరువాత ఇప్పటి వరకూ ఈ స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదుకాలేదు.  
► ప్రొటీన్‌ ఆధారిత ఉత్పత్తులు– మాంసం, గుడ్ల ధరలు 5.92%, 0.86% చొప్పున పెరిగాయి.  
►తృణ ధాన్యాలు సంబంధిత ఉత్పత్తుల ధరలు 1.32 శాతం పెరిగాయి. 
► ధరలు తగ్గిన ఉత్పత్తుల జాబితాలో పండ్లు (–4.62 శాతం), కూరగాయలు (–7.69 శాతం) ఉన్నాయి. జనవరి నెలలో కూడా ఈ ఉత్పత్తుల ధరలు – 4.18 శాతం, – 13.32 శాతం  చొప్పున తగ్గాయి.  
►ఇంధనం, లైట్‌ విభాగంలో రేటు 2.20 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గింది.

రేటు కోతకు చాన్స్‌... 
ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించుకున్న మేర కట్టడిలో ఉంది. ఇక పారిశ్రామిక ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక క్రియాశీలతకు ఆర్‌బీఐ మరో దఫా రేటు కోతవైపే మొగ్గుచూపే వీలుంది.
– రజనీ ఠాకూర్,  ఎకనమిస్ట్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 

మరిన్ని వార్తలు