మార్కెట్‌కు ప్యాకేజ్‌ బూస్టర్‌

18 Apr, 2020 04:09 IST|Sakshi

కరోనా చికిత్సలో సత్ఫలితాలిస్తున్న అమెరికా ఔషధం 

అమెరికా, యూరప్‌ల్లో దశలవారీగా తొలగనున్న లాక్‌డౌన్‌

లాభాల్లో ప్రపంచ మార్కెట్లు

కోలుకున్న రూపాయి.. 

986 పాయింట్ల లాభంతో 31,589కు సెన్సెక్స్‌ 

274 పాయింట్లు పెరిగి  9,267కు నిఫ్టీ  

కరోనా వైరస్‌ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునే చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ కొన్ని లిక్విడిటీ పెంచే చర్యలను  తీసుకుంది. దీంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది.  రూపాయి మారకం పుంజుకోవడం, ప్రపంచ మార్కెట్లు లాభాల్లోనే ట్రేడవడం  కలసివచ్చాయి. అమెరికాలో కరోనా కేసుల చికిత్సలో గిలీడ్‌ ఔషధం మంచి ఫలితాలను చూపిస్తోందన్న వార్తలు సానుకూల ప్రభావం చూపించాయి. ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ, సెన్సెక్స్‌ 31,500 పాయింట్లు, నిఫ్టీ 9,250 పాయింట్ల ఎగువున ముగిశాయి.

  సెన్సెక్స్‌ 986  పాయింట్ల లాభంతో 31,589 పాయింట్ల వద్దకు చేరింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 274 పాయింట్లు పెరిగి 9,267 పాయింట్ల వద్ద ముగిసింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 3.22 శాతం, నిఫ్టీ 3.03 శాతం  చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నెల గరిష్టానికి చేరాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 429 పాయింట్లు, నిఫ్టీ 155 పాయింట్లు చొప్పున పెరిగాయి. స్టాక్‌ సూచీలు వరుసగా రెండో వారమూ లాభపడ్డాయి.  

అదిరిపోయే ఆరంభం...
సెన్సెక్స్, నిఫ్టీలు ఆరంభంలోనే దుమ్మురేపాయి. ఆర్‌బీఐ గవర్నర్‌  ఉదయం గం.10లకు కీలక ప్రకటన చేయనున్నారన్న వార్తల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు భారీ గ్యాపప్‌తో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 1,054 పాయింట్లు, నిఫ్టీ 330 పాయింట్ల భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. మ«ధ్యాహ్నం లాభాలు తగ్గినా, రోజంతా ఇదే జోరు కొనసాగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,116  పాయింట్లు, నిఫ్టీ 331 పాయింట్ల మేర పెరిగాయి.  

లాభాలకు కారణాల్లో కొన్ని...
ఆర్‌బీఐ లిక్విడిటీ బూస్ట్‌: పలు చర్యలకు తోడు అవసరమైతే, మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అభయమివ్వడంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి.  
అంచనాల కన్నా చైనా జీడీపీ బెటర్‌ : ఈ ఏడాది మొదటి త్రైమాసిక కాలంలో చైనా జీడీపీ 6.8 శాతం తగ్గి్గంది. జీడీపీ గణాంకాలు వెల్లడించినప్పటి నుంచి ఇదే తొలి తగ్గుదల  అయినప్పటికీ, అంచనాల కంటే (జీడీపీ 8.2 శాతం తగ్గుతుందన్న అంచనాలున్నాయి)తక్కువగానే జీడీపీ తగ్గడం... ఇన్వెస్టర్లకు ఒకింత ఊరటనిచ్చింది.  

రెమ్‌డిసివిర్‌... సత్ఫలితాలు..!
అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ గిలీడ్‌ సైన్సెస్‌ ఔషధం, రెమ్‌డిసివిర్‌....కరోనా చికిత్సలో మంచి ఫలితాలు చూపిస్తోందన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి.  

లాభాల్లో ప్రపంచ మార్కెట్లు  
చైనా జీడీపీ అంచనాల కంటే తక్కుగానే తగ్గడం, కరోనా చికిత్సలో అమెరికా ఔషధం సత్ఫలితాలనిస్తుండటం, అమెరికాతో సహా పలు యూరప్‌ దేశాలు లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేయనుండటం.. ఈ కారణాలన్నింటి కారణంగా ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి.

రూ.3 లక్షల కోట్ల లాభం
మార్కెట్‌ భారీ  లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ. 3 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ. 2.83  లక్షల కోట్ల పెరిగి రూ. 123.50 లక్షల కోట్లకు ఎగసింది.  

మరిన్ని వార్తలు