ప్రజలను అప్రమత్తం చేయండి

22 Apr, 2016 17:53 IST|Sakshi
ప్రజలను అప్రమత్తం చేయండి

మోసపూరిత ఆఫర్ల విషయమై
బ్యాంక్‌లకు ఆర్‌బీఐ సూచన

 ముంబై: ఈ మెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా వచ్చే మోసపూరిత ఆఫర్ల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బ్యాంకులకు సూచించింది. ఆర్థికాంశాల పట్ల తగిన అవగాహన లేకపోవడం, జాగరూకత లేకపోవడం వల్ల అమాయకులైన ప్రజలు ఇలాంటి మోసపూరిత ఆఫర్లకు బలై నష్టపోతున్నారని ఆర్‌బీఐ పేర్కొంది. ఇలాంటి స్కీమ్‌లు/ఆఫర్ల పట్ల ప్రజలే కాకుండా బ్యాంక్‌లు కూడా నష్టపోతున్నాయని వివరించింది. లాటరీ తగిలిందనో లేక ప్రైజ్‌లు వచ్చాయనో ఫోన్‌కాల్స్, ఈమెయిల్స్ వస్తాయని, కొంత మొత్తం డబ్బులు డిపాజిట్ చేస్తే ఈ లాటరీ/ప్రైజ్‌లు మీకు వస్తాయని మోసగాళ్లు ప్రలోభపెడతారని పేర్కొంది. వాళ్లు చెప్పినట్లుగా డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ తర్వాత ఎలాంటి స్పందన ఉండదని వివరించింది.

బ్యాంకులు తమ ఖాతాదారుల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ తరహా మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేలా పోస్టర్లు, పాంప్లెట్లు, నోటీసులు, ఇంకా ఇతర మార్గాల ద్వారా బ్రాంచ్‌లు, ఏటీఎంల్లో విస్తృతమైన ప్రచారం చేయాలని ఆర్‌బీఐ సూచించింది. మోసపూరిత ఆఫర్ల పట్ల ప్రజలు ఆకర్షితులు కాకుండా చూడడంలో బ్యాంక్ సిబ్బంది తగిన తోడ్పాటునందించాలని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ. లక్షకు మించిన మోసపూరిత కేసులు 861 నమోదయ్యాయని, వీటి విలువ రూ.4,920 కోట్లని వివరించింది. ఇక 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1,651 కేసులు నమోదయ్యాయని,  వీటి విలువ రూ.11,083 కోట్లని పేర్కొంది.

మరిన్ని వార్తలు