ఏడు బ్యాంకులకు ఆర్‌బీఐ ఝలక్‌

13 Feb, 2019 13:07 IST|Sakshi

సాక్షి,ముంబై: బ్యాంకింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వ, ప్రవేటు రంగాలకు చెందిన ఏడు బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జరిమానా విధించింది. నో యువర్ కస్టమర్ (కెవైసి) నిబంధనలు, యాంటీ మనీ లాండరింగ్ (ఏఎంఎల్) ప్రమాణాలపై ఆర్బీఐ జారీ చేసిన పలు సూచనలను పాటించనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా అలహాబాదు బ్యాంకు, ఇండియన్‌​ ఓవర్‌సీస్‌ బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్రకు 1.5 కోట్ల రూపాయల జరిమానా విధంచగా,  ఆంధ్రాబ్యాంకునకు  కోటి రూపాయల పెనాల్టీ వడ్డించింది. వీటితో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహింద్ర బ్యాంక్, ఐడిబిఐ బ్యాంకులకు రూ. 20 లక్షలు చొప్పున జరిమానా  విధించింది. 

ఈ చర్య కేవలం క్రమబద్ధీకరణను పాటించడంలో జరిగిన లోపాలపై తీసుకున్నట్టు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఖాతాదారులతో బ్యాంకుల ఎలాంటి లావాదేవీని, లేదా ఒప్పందాల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఉద్దేశించినది కాదని తెలిపింది. నిధుల అంతిమ వినియోగంపై పర్యవేక్షణ, ఇతర బ్యాంకులతో సమాచార వినిమయం, మోసాల వర్గీకరణ, వివరణ, ఖాతాల పునర్నిర్మాణంపై ఆర్‌బీఐ  నిబంధనలను పాటించని కారణంగా ఈ చర్య తీసుకున్నామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు