రుణాలు ఇక పండగే!

8 Aug, 2019 05:08 IST|Sakshi

గృహ, వాహన, కార్పొరేట్‌ రుణాలు మరింత చౌక

వరుసగా నాలుగోసారి రెపో రేటు కోత   35 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఆర్‌బీఐ

5.4 శాతానికి దిగొచ్చిన రెపో రేటు.. ∙5.15 శాతానికి రివర్స్‌ రెపో రేటు

జీడీపీ వృద్ధి రేటు అంచనాలు 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గింపు

సరళ పాలసీ విధానం కొనసాగింపు   డిమాండ్, పెట్టుబడులు పెంపే లక్ష్యం

ముంబై: పండుగలు మొదలవుతున్న తరుణంలో రుణగ్రహీతలకు రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) తీపికబురు తెచ్చింది. కీలక పాలసీ రేట్లను అంచనాలకు మించి తగ్గించడంతో... ఇక అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు దిగిరానున్నాయి.  నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం కూడా తగ్గనుంది. కాగా, దిగజారుతున్న దేశ ఆర్థిక వృద్ధి, పడిపోతున్న డిమాండ్‌ ఆర్‌బీఐనీ ఆందోళనకు గురిచేస్తోంది! బుధవారం వెల్లడైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష నిర్ణయాల్లో ఇదే తేటతెల్లమైంది. వృద్ధి క్షీణతకు చెక్‌ పెట్టేందుకు, వ్యవస్థలో డిమాండ్‌ పెంచేందుకు తన వంతుగా రేట్ల కోతతో ముందుకు వచ్చింది.

25 బేసిస్‌ పాయింట్ల వరకు రెపో రేటును తగ్గించొచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేయగా, ఈ విషయంలో ఆర్‌బీఐ విశాలంగానే స్పందించి 35 బేసిస్‌ పాయింట్లను తగ్గించి ఆశ్చర్యపరిచింది. బ్యాంకులకు సమకూర్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటుగా పేర్కొంటారు. ‘‘25 బేసిస్‌ పాయింట్ల తగ్గింపు సరిపోదు. 50 బేసిస్‌ పాయింట్ల తగ్గింపు ఎక్కువ అవుతుంది. 35 బేసిస్‌ పాయింట్లు అన్నది సమతుల్యంగా ఉంటుందని ఎంపీసీ భావించింది’’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు.

సాధారణంగా ఆర్‌బీఐ పావు శాతం లేదా అరశాతం (25 బేసిస్‌ పాయింట్ల మల్టిపుల్‌లో) మేర రేట్లలో చేసే మార్పులకు, 35 బేసిస్‌ పాయింట్ల తగ్గింపు అన్నది వినూత్నమే. గత డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకు ఆర్‌బీఐ 1.1% రెపో రేటును తగ్గించడం విశేషం. తాజా నిర్ణయం తర్వాత రెపో రేటు 5.4%కి, రివర్స్‌ రెపో రేటు (బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ సమీకరించే నిధులపై ఇచ్చే రేటు) 5.15%కి దిగొచ్చాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) జీడీపీ వృద్ధి అంచనాలను గతంలో ఉన్న 7% నుంచి 6.9 శాతానికి తగ్గించింది. సర్దుబాటు ధోరణిని కొనసాగించింది. అంటే పాలసీ విషయంలో ఉదారంగా వ్యవహరించే వెసులుబాటు ఈ విధానంలో ఉంటుందని ఆశించొచ్చు. అవసరమైతే భవిష్యత్తులోనూ రేట్ల కోత చేపట్టవచ్చని ఇది సూచిస్తుంది.

బలహీనంగా ఆర్థిక రంగం
‘‘దేశీయ ఆర్థిక కార్యకలాపాలు బలహీనంగానే ఉన్నాయి. అంతర్జాతీయ మందగమనం, వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం వృద్ధి తగ్గే రిస్క్‌ను పెంచుతున్నాయి. వృద్ధిపై ఆందోళనలకు పరిష్కారంగా డిమాండ్‌ను పెంచేందుకు, ప్రైవేటు పెట్టుబడులను పెంచడం అన్నది ఈ దశలో అత్యంత ముఖ్యమైనది’’ అని రేట్ల కోత అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఎంపీసీ స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు