రిటైల్ రుణాలపై సిండికేట్ బ్యాంక్ దృష్టి

8 Oct, 2016 01:34 IST|Sakshi
రిటైల్ రుణాలపై సిండికేట్ బ్యాంక్ దృష్టి

సాక్షి, అమరావతి: పండుగలను దృష్టిలో పెట్టుకొని రిటైల్ రుణాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ ప్రకటించింది. వచ్చే డిసెంబర్ వరకు రిటైల్ రుణాలను  అదనంగా 0.25 శాతం తగ్గింపు ధరలకే అందిస్తున్నట్లు సిండికేట్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ (ఏపీ, తెలంగాణ హెడ్) ఎస్.పి.శర్మ తెలిపారు. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలను వసూలు చేయడం లేదన్నారు. మరోవైపు ఎంఎస్‌ఎంఈ రుణాలు, కాసా ఖాతాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. కార్లపై ఆన్‌రోడ్ ధరలో 95 శాతం వరకు రుణాన్ని సిండికేట్ బ్యాంక్ అందిస్తోందన్నారు.

శుక్రవారం విజయవాడ రీజియన్ సమీక్షకు వచ్చిన శర్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ రాజధాని తరలిరావడంతో ఇక్కడి విస్తరణపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో రాజధాని పరిసర ప్రాంతాల్లో కొత్తగా 10 శాఖలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విజయవాడ రీజియన్‌లో 79 శాఖలను సిండికేట్ బ్యాంక్ కలిగి వుంది.

ఎన్‌పీఏలను తగ్గించుకోవడానికి చేపట్టిన వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీంకు మంచి స్పందన వచ్చినట్లు శర్మ తెలిపారు. సుమారు రూ. 10 కోట్ల విలువైన 45 ఎన్‌పీఏ ఖాతాలను ఈ స్కీం కింద పరిష్కరించినట్లు తెలిపారు. మరో రూ. 10 కోట్ల ఎన్‌పీఏలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయన్నారు. విజయవాడ రీజియన్‌లో సిండికేట్ బ్యాంక్‌కు రూ. 135 కోట్ల ఎన్‌పీఏలున్నాయి.

మరిన్ని వార్తలు