లోన్లు ఇక చవకేనట!

2 Aug, 2017 17:42 IST|Sakshi
లోన్లు ఇక చవకేనట!

ముంబై: రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీలో   రెపో రేటు తగ్గించడంతో రుణాల రేట్లు మరింత దిగి రానున్నాయి. కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు  తగ్గించడంతో ఈ బాటను  మిగిలిన బ్యాంకులు కూడా అనుసరించనున్నాయి. దీంతో బ్యాంక్‌  ఖాతాదారులకు మరింత చవకగా లోన్‌ సౌకర్యం లభించనుంది. మానిటరీ పాలసీ రివ్యూ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌  ఈ వ్యాఖ్యలు చేశారు. 

ద్రవ్య విధాన కమిటీలో నలుగురు సభ్యులు 25 బీపీఎస్‌ పాయింట్లను  తగ్గించటానికి ఓటు వేయగా, 50  పాయింట్ల కట్ కొరకు ఒక ఓటు పడిందని  ఆర్‌బీఐ గవర్నర్‌  తెలిపారు.   ద్రవ్యోల్బణం దిగి రావడంతో కేంద్రం బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.  తద్వారా బ్యాంకులు కూడా తమ వడ్డీరేట్లను  తగ్గించనున్నాయని  ఉర్జిత్‌ పటేల్‌  చెప్పారు. రుణాల తగ్గింపు ప్రకటించని కొన్ని విభాగాల్లో  రేట్లు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. 

మార్కెట్‌ అంచనాలకనుగుణంగానే ఆర్‌బీఐ  తన పాలసీ రివ్యూని వెల్లడించింది.   0.25 శాతం కోతతో రెపో రేటు 6శాతం వద్ద నిలిచింది. 2016 నవంబర్‌  స్థాయి వద్ద ఏడేళ్ల కనిష్టాన్ని నమోదు చేసింది. అలాగే రివర్స్‌రెపో  కూడా 0.25శాతం కోతతో ప్రస్తుత 5.75గా ఉండనుంది. వడ్డీ రేట్లను తగ్గించాలనే రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయం నిరంతర ఆర్థిక వృద్ధికి కీలకమైనదని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్  వ్యాఖ్యానించారు. కాగా మానిటరీ పాలసీ కమిటీ తరువాతి సమావేశం అక్టోబర్ 3, 4 తేదీల్లో జరుగుతుంది.

మరిన్ని వార్తలు