ఆర్‌బీఐపై సీవీసీ విమర్శలు

3 Apr, 2018 20:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  పీఎన్‌బీ కుంభకోణంలో  సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌(సీవీసీ)  కేవీ. చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌  స్కాంలో రిజర్వు బ్యాంకు ఆఫ్‌  ఇండియా  సరైన ఆడిట్స్‌ నిర్వహించలేదని పేర్కొన్నారు. సీబీఐ విచారణను పర్యవేక్షిస్తున్న సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. పీఎన్‌బీ స్కాం విషయంలో​ తప్పు ఆర్‌బీఐదే అంటూ సీవీసీ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఆడిటింగ్‌ విధానాన్ని పటిష్టపరచాల్సిన అవసరాన్ని ఆయన  నొక్కి చెప్పారు.

పీఎన్‌బీ బ్యాంకులో కుంభకోణం జరిగిన సమయంలో రిజర్వు బ్యాంకు సరైన ఆడిట్స్‌ నిర్వహించలేదని, కాబట్టి తప్పు ఆర్‌బీఐదే అని ఆయన విమర్శించారు. ఆర్‌బీఐ మరింత పటిష్టమైన ఆడిటింగ్‌ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరముందన్నారు. బ్యాంకుల్లో రిస్క్‌లను గుర్తించేందుకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. వాటి ఆధారంగా ఆడిటింగ్‌ చెయ్యాలి. కానీ పీఎన్‌బీలో సమయానుసారంగా ఆర్‌బీఐ అలా స్పష్టంగా ఆడిటింగ్‌ చేయలేదని చౌదరి ఆరోపించారు.

కాగా దాదాపు 13వేల కోట్ల రూపాయల పీఎన్‌బీ స్కాం ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి.  అటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా ఇప్పటికే  భారీ మోసాన్ని గుర్తించడంలో విఫలమయ్యారంటూ రెగ్యులేటర్స్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు