పసిడి దిగుమతిపై ఆంక్షల సడలింపు

22 May, 2014 00:55 IST|Sakshi
పసిడి దిగుమతిపై ఆంక్షల సడలింపు

ముంబై: బంగారం దిగుమతులపై ఆంక్షలను రిజర్వు బ్యాంకు సడలించింది. ఇప్పటికే అనుమతించిన బ్యాంకులతో పాటు ఎంపిక చేసిన ట్రేడింగ్ హౌస్‌లను పసిడి దిగుమతులకు అనుమతించింది. విదేశీ వాణిజ్య డెరైక్టర్ జనరల్ (డీజీఎఫ్‌టీ) వద్ద నామినేటెడ్ ఏజెన్సీలుగా నమోదైన స్టార్ ట్రేడింగ్ హౌస్‌లు, ప్రీమియర్ ట్రేడింగ్ హౌస్‌లు ఇకనుంచి 20:80 ఫార్ములా ప్రకారం పుత్తడిని దిగుమతి చేసుకోవచ్చు. ఈ మేరకు రిజర్వు బ్యాంకు బుధవారం ఓ నోటిఫికేషన్ జారీచేసింది.

 భారీగా పెరిగిపోయిన కరెంటు అకౌంటు లోటు(క్యాడ్)ను, రూపాయి పతనాన్ని అదుపుచేసేందుకు రిజర్వు బ్యాంకు గత జూలైలో బంగారం దిగుమతులపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. కొన్ని బ్యాంకులకు మాత్రమే... అది కూడా 20:80 ఫార్ములాతో దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. దిగుమతి చేసుకున్న బంగారంలో ఐదో వంతును, అంటే 20 శాతాన్ని తిరిగి ఎగుమతి చేయడమే ఈ ఫార్ములా. 2012-13లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 4.8 శాతంగా ఉన్న కరెంటు అకౌంటు లోటు ప్రభుత్వ చర్యల ఫలితంగా 2013-14లో సుమారు 1.7 శాతానికి తగ్గిపోయిందని అంచనా. గతేడాది ఆగస్టులో అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ.69గా ఉండగా ప్రస్తుతం అది రూ.59 దిగువ స్థాయికి చేరింది. ఆభరణాల తయారీదారులు, బులియన్ డీలర్లు, బ్యాంకులు, వ్యాపార సంస్థల విజ్ఞప్తి మేరకు ఆంక్షలను సడలించారు.

 బీఎంబీ డిపాజిట్లకు ఇక మరింత రక్షణ!
 భారతీయ మహిళా బ్యాంక్(బీఎంబీ) డిపాజి టర్లకు మరింత రక్షణ కల్పించే కీలక చర్యను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తీసుకుంది. ఆర్‌బీఐ చట్టం, 1934 రెండవ షెడ్యూల్‌లో బ్యాం క్‌ను చేర్చుతున్నట్లు ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. దీనిప్రకారం కమర్షియల్ బ్యాంక్ కేటగిరీలోకి బీఎంబీ చేరుతుంది. మహిళల  కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన బ్యాంక్ ఇది. రూ.1,000 కోట్ల ముందస్తు మూలధనంతో 2013 నవంబర్ నుంచీ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభించింది.
 

>
మరిన్ని వార్తలు