ఇన్‌ఫ్రా సంస్థలకు వడ్డీ మోత

10 Jun, 2015 00:03 IST|Sakshi
ఇన్‌ఫ్రా సంస్థలకు వడ్డీ మోత

ఆస్తులు అమ్ముకున్నా తగ్గని వడ్డీభారం
మిగిలిన ఆస్తులు అమ్ముదామన్నా కొనేవారు కరువుఆర్‌బీఐ రేట్ల తగ్గింపు ప్రభావం కనిపించడం లేదు లబోదిబోమంటున్న ఇన్‌ఫ్రా కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడచిన ఆరు నెలల్లో ఆర్‌బీఐ వడ్డీరేట్లను ముప్పావు శాతం తగ్గించింది. అయినా.. ఇన్‌ఫ్రా కంపెనీల కష్టాలు తగ్గకపోగా మరింత పెరుగుతున్నాయి. కంపెనీల ఫలితాలను చూస్తే ఇదే అర్థమవుతోంది. వడ్డీరేట్లు తగ్గుతున్నా.. అప్పులు తగ్గించుకోవడానికి ఆస్తులు అమ్ముకుంటున్నా...వడ్డీభారం అంతకంటే వేగంగా కొండలా పెరిగిపోతోంది. గడచిన ఏడాది కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు ప్రధాన ఇన్‌ఫ్రా కంపెనీలు రుణాలకు చెల్లిం చిన వడ్డీల్లో 20 శాతం వృద్ధి నమోదయ్యింది.

ఈ ఆరు కంపెనీలు 2013-14లో వడ్డీల కింద రూ. 8,300 చెల్లిస్తే, గడచిన ఏడాది ఈ మొత్తం రూ. 10,000 కోట్లకు చేరింది. ఆర్‌బీఐ వడ్డీరేటు తగ్గించినా ఆ మొతాన్ని బ్యాంకులు పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడమే దీనికి ప్రధాన కారణంగా ఉంది. చాలా బ్యాంకులు 25 నుంచి 40 బేసిస్ పాయింట్ల వరకు మాత్రమే తగ్గించాయి. ఆర్‌బీఐ జనవరిలోనే వడ్డీరేట్లు తగ్గించినా ఆంధ్రాబ్యాంక్ వంటి కొన్ని బ్యాంకులు జూన్ వరకు పాత రుణాలపై వడ్డీరేట్లను తగ్గించలేదు.

తెలుగు రాష్ట్రాల ఇన్‌ఫ్రా కంపెనీలకు ఆంధ్రాబ్యాంక్ పెద్ద మొత్తంలో రుణాలను ఇవ్వడంతో ఈ కంపెనీలు ఇంత వరకు వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని పొందలేకపోయాయి. ఐదేళ్ళ క్రితం రుణాలు ఏడు శాతం మీద తీసుకుంటే... ఇప్పుడు 14 శాతం మీద వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని ఒక ఇన్‌ఫ్రా కంపెనీ అధినేత వాపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధిరేటును దాటేస్తుందన్న సర్వే నివేదికలు నమ్మి అప్పులు తీసుకొని భారీ ప్రాజెక్టులను మొదలు పెట్టామని, ఇప్పుడవి ఆగిపోగా.. తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామన్నారు.

ఆస్తులు అమ్మినా..
గడిచిన ఏడాది కాలంలో జీఎంఆర్, ల్యాంకో,  ఐవీఆర్‌సీఎల్, ఎన్‌సీసీ కంపెనీలు గుదిబండగా మారిన ప్రాజెక్టులను విక్రయించుకోవడం ద్వారా రుణ భారం తగ్గించుకునే ప్రయత్నం చేశాయి. అత్యధిక రుణ భారం ఉన్న జీఎంఆర్ ఇన్‌ఫ్రా విషయాన్ని తీసుకుంటే ఇప్పటి వరకు కొన్ని రోడ్డు ప్రాజెక్టుల్ని విక్రయించడం ద్వారా సుమారు రూ. 6,000 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకుంది. అయినా.. ఏడాది కాలంలో జీఎంఆర్ గ్రూపు చెల్లించిన వడ్డీ రూ. 2,972 కోట్ల నుంచి రూ. 3,572 కోట్లకు చేరిందంటే వడ్డీరేట్లు ఏ విధంగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే ల్యాంకో ఇన్‌ఫ్రా రూ. 6,300 కోట్లకు ఉడిపి ప్లాంట్‌ను విక్రయించి రుణ భారాన్ని తగ్గించుకున్నా.. ఆ ప్రయోజనం పుస్తకాల్లో కనిపించడం లేదు.

గణాంకాలను మార్చి ఆర్థిక వృద్ధిరేటు 4% నుంచి 7.3%కి పెంచినట్లు చూపిస్తున్నారని, కానీ వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయని, మరికొన్ని ఆస్తులు అమ్ముకుందామన్నా కొనేవారే కనపడటంలేదని ఇన్‌ఫ్రా కంపెనీల ప్రతినిధులు వాపోతున్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడి ఏడాదయినా.. ఆగిపోయిన ఒక్క భారీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు మొదలు కాలేదని అంటున్నారు.

అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మాత్రం భవిష్యత్తుపై ఆశలను చిగురింప చేస్తున్నాయని ఇన్‌ఫ్రా కంపెనీ అధినేత పేర్కొన్నారు. గ్యాస్, బొగ్గు సరఫరా లేక విద్యుత్ ప్రాజెక్టులు ఆగిపోగా, చాలా రహదారుల ప్రాజెక్టులు పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు లేక మధ్యలో ఆగిపోయాయి. దీంతో కంపెనీలు ఉద్యోగులను భారీగా తగ్గించేసుకున్నాయి. ఒకప్పుడు జీఎంఆర్ గ్రూపులో ఉద్యోగుల సంఖ్య 5,000కుపైగా ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 1,500 లోపునకు పరిమితం కావడం దీనికి నిదర్శనం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆగిపోయిన ప్రాజెక్టుల క్లియరెన్స్‌లపై దృష్టిసారించాలని కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు