మారటోరియంతో మీకేంటి లాభం...?

22 May, 2020 11:37 IST|Sakshi

మరో మూడు నెలలపాటు మారటోరియం పొడిగింపు 

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) మరో మూడు నెలల పాటు మారటోరియంను పొడిగించింది. శుక్రవారం ఉదయం ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..లోన్‌ ఈఎంఐలపై మరో మూడు నెలలు అంటే ఆగస్టు 31 వరకు మారటోరియాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. లాక్‌ డౌన్‌ కారణంగా మార్చి1వ తేదీ నుంచి మే 31 వరకు  మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పొడిగించిన తాజా మారటోరియంతో మొత్తం లోన్ల ఈఎంఐలపై ఆరు నెలలపాటు మారటోరియం లభించింది. దీనిప్రకారం టర్మ్‌లోన్లపై ఈఎంఐ (వాయిదాలు) కట్టాల్సిన వారు ఆగస్టు 31 వరకు ఈఎంఐలు చెల్లించనవసరం లేదు. 

తాజా మారటోరియంతో కార్‌లోన్స్‌, గృహ రుణాలు వంటివి తీసుకున్నవారికి కొంత వెసులుబాటు లభిస్తుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం కోల్పోయిన వారు ఈ మారటోరియం ఉపయోగించుకోవడం వల్ల ఆర్థిక ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమ పద్ధతిలో వాయిదా చెల్లించాల్సిందే. ఒక వేళ ఏదైనా కారణంతో వాయిదా చెల్లింపు జరగకపోతే సదరు ఖాతాదారుపై బ్యాంక్‌లు,రుణదాతలు చర్యలు చేపడతాయి. అంతేగాక ఖాతాదారు, క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది. దీంతో భవిష్యత్తులో బ్యాంకులు అందించే రుణసదుపాయాలు పొందలేరు. అందువల్ల మారటోరియం ఇటువంటి వారికి ఎంతో ఉపకరిస్తుంది. ఇటువంటి వారు మారటోరియం తీసుకుంటే పై సమస్యలేవీ ఎదుర్కొనే అవసరం ఉండదు. బుల్లెట్‌ రిపేమెంట్స్‌, ఈక్వెటెడ్‌ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌, క్రెడిట్‌ కార్డ్‌ డ్యూలు వంటి వాటిపై తాజాగా పొడిగించిన  మారటోరియం తీసుకోవచ్చు. 

వడ్డీమాత్రం తప్పదు..
మారటోరియంలో ఈఎంఐలు చెల్లించకపోయినప్పుడు ఆ నెల ఈఎంఐలో కట్టాల్సిన వడ్డీ మాత్రం తరువాతి నెలలో  మొత్తం రుణంపై  పడుతుంది. అంటే మనం మారటోరియం తీసుకున్న  సదరు నెలల్లో ప్రతినెలా ప్రిన్స్‌పల్‌ మొత్తంపై వడ్డీ పడుతుంది.తద్వారా మారటోరియం కాలపరిమితి ముగిసాక చెల్లించే ఈఎంఐలో ఈ వడ్డీ అదనంగా చేరుతుంది. అందువల్ల అత్యవసరమైతే తప్ప, మారటోరియం తీసుకోవాలేగానీ, నగదు ఉన్న వారు, ఆర్థిక ఇబ్బందులు లేనివారు ఈఎంఐలు చెల్లించడమే మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ వెసులుబాటులేని వారు మారటోరియం తీసుకుని క్రెడిట్‌,సిబిల్‌ స్కోరులను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

Related Tweets
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా