చిన్న పరిశ్రమ వృద్ధిపై ఆర్‌బీఐ దృష్టి 

3 Jan, 2019 02:10 IST|Sakshi

సిన్హా నేతృత్వంలో నిపుణలు కమిటీ

వచ్చేవారం ఈ రంగం ప్రతినిధులతో ఆర్‌బీఐ గవర్నర్‌ భేటీ

ముంబై: లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధిపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  మరింత దృష్టి సారిస్తోంది. ఈ రంగం అభివృద్ధిపై సలహాలకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే ఈ రంగం ప్రతినిధులతో వచ్చేవారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ సమావేశం కానున్నారు.  నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) ప్రతినిధులతో కూడా తాను వచ్చేవారం సమావేశం కానున్నట్లు శక్తికాంత్‌ దాస్‌ ట్వీట్‌ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే... ∙ఎంఎస్‌ఎంఈ రంగానికి సంబంధించి ఆర్థిక, ద్రవ్య స్థిరత్వానికి దీర్ఘకాలిక సూచనలు చేయడానికి ఆర్‌బీఐ బుధవారం ఒక అత్యున్నత  స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ మాజీ చైర్మన్‌ యూకే సిన్హా నేతృత్వం వహిస్తారు.

ఎనిమిది మంది సభ్యుల ఈ కమిటీ, 2019 జూన్‌ నాటికి  తన నివేదికను సమర్పిస్తుంది. చిన్న పరిశ్రమలకు రుణ లభ్యతపై, ఇందుకు సంబంధించి ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టి పెడుతుంది. దేశం మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్‌ఎంఈ వాటా 40%కాగా, తయారీ రంగంలోఈ విభాగం వాటా 45 శాతం.∙ఆర్‌బీఐ మంగళవారం చిన్న పరిశ్రమలకు భారీ ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలోనే ఈ రంగానికి సంబంధించి తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఆర్‌బీఐ చేసిన ప్రకటన ప్రకారం–  రూ. 25 కోట్ల వరకూ రుణం ఉండి, చెల్లించలేకపోతున్న రుణాన్ని, ఒకేసారి పునర్‌వ్యవస్థీకరించడానికి ఆర్‌బీఐ అనుమతించింది. అయితే సంస్థ రుణం పునర్‌వ్యవస్థీకరించే నాటికి, ఆ సంస్థ జీఎస్‌టీలో నమోదై ఉండాలి.

అయితే జీఎస్‌టీ నమోదు అవసరం లేదని మినహాయింపు పొందిన ఎంఎస్‌ఎంఈలకు ఇది వర్తించదు.  ఎన్‌బీఎఫ్‌సీ ప్రతినిధులతో దాస్‌ సమావేశం మరో ముఖ్య విశేషం.  దేశంలోని అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణ చెల్లింపుల వైఫల్యం నేపథ్యంలో పలు ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు తీవ్ర లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ గవర్నర్‌గా డిసెంబర్‌ 12న బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండుసార్లు ప్రభుత్వ బ్యాంకర్లతో, ఒకసారి ప్రైవేటు బ్యాంకర్లతో సమావేశమయ్యారు. లిక్విడిటీ, చిన్న పరిశ్రమలకు రుణ లభ్యతసహా దిద్దుబాటు చర్యల పరిధిలో (పీసీఏ) ఉన్న 11 బ్యాంకులపై  ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు సమాచారం. 

రుణ పునర్‌వ్యవస్థీకరణ స్కీమ్‌పై ఎంఎస్‌ఎంఈ డిమాండ్‌ 
ఇదిలావుండగా, ఆర్‌బీఐ రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకాన్ని వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కింద ఇంకా రిజిస్టర్‌ కాని కంపెనీలకూ వర్తింపజేయాలని ఎంఎస్‌ఎంఈ డిమాండ్‌ చేసింది. సంబంధిత సంస్థల రుణాలనూ ప్రాధాన్యతా రంగానికి ఇస్తున్న రుణాలుగా పరిగణించాలని విజ్ఞప్తి చేసింది.   
 

మరిన్ని వార్తలు