‘శక్తి’మాన్‌.. బ్రహ్మాస్త్రం!

28 Mar, 2020 01:53 IST|Sakshi

కరోనాపై వార్‌

రెపో రేటు భారీగా 0.75 శాతం తగ్గింపు

దీనితో ఈ రేటు 4.4 శాతానికి డౌన్‌

16 సంవత్సరాల కనిష్ట స్థాయి

నెలవారీ రుణ చెల్లింపులపై 3 నెలల మారటోరియానికి అనుమతి

రెపోసహా వివిధ మార్గాల్లో  వ్యవస్థలోకి రూ. 3.74 లక్షల కోట్లు

2019–20లో 5 శాతం జీడీపీ వృద్ధి రేటు అంచనా

వారం రోజుల ముందే ఆర్‌బీఐ కీలక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు

పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా... అసలే ఆర్థిక మందగమనంతో అతలాకుతలం అయిన భారత్‌ ఆర్థిక వ్యవస్థ తాజాగా కరోనా కాటుకు గురవుతున్న నేపథ్యంలో... పరిస్థితిని చక్కదిద్దడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రంగంలోకి దిగింది.  ఏప్రిల్‌ 1 నుంచి 3వ తేదీ మధ్య జరగాల్సిన 2020–21 మొదటి ద్రవ్య పరపతి విధాన సమీక్షను అర్ధంతరంగా మార్చి 27కు మార్చింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా కమిటీ సమావేశాన్ని సైతం వారం రోజులు ముందుకు తీసుకువచ్చిన అంశాన్ని పరిశీలిస్తే, ప్రస్తుత ఆర్థిక అత్యవసర పరిస్థితులను అవగాహన చేసుకోవచ్చు.   ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనవి పరిశీలిస్తే...

గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలు ఇక చౌక
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో రేటును భారీగా 75 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ రేటు 4.4 శాతానికి దిగివచ్చింది.  కోవిడ్‌–19 ప్రభావం నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, మందగమన ధోరణులను ఎదుర్కొనడానికి అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌సహా దాదాపు 43 సెంట్రల్‌ బ్యాంకులు రేటు కోత నిర్ణయం తీసుకున్నాయి. 2019 ఫిబ్రవరి నుంచి (చివరిసారి రెండు సార్లు మినహా) వరుసగా ఐదుసార్లు రెపో రేటును 135 బేసిస్‌ పాయింట్లమేర ఆర్‌బీఐ తగ్గించింది.

దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపులో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయం తీసుకోగలిగిన ఆర్‌బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి రెండు సమావేశాల్లో ఈ దిశలో నిర్ణయాలు తీసుకోలేకపోయింది. శుక్రవారం తీసుకున్న నిర్ణయంతో రెపో రేటు 16 సంవత్సరాల కనిష్టానికి తగ్గింది. దీనికి సంబంధించి మరింత లోతుకు వెళితే... 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో 2009 ఏప్రిల్‌లో రెపో రేటు 4.75 శాతానికి తగ్గింది. అటు తర్వాత అంతకంటే తక్కువ స్థాయికి ప్రస్తుతం రెపోరేటు దిగివచ్చింది. ఇక ప్రస్తుత 4.4 శాతం రెపో రేటు 2004 తర్వాత చూడ్డం ఇదే తొలిసారి. అంటే ప్రస్తుత రేటు దశాబ్దంన్నర కనిష్టస్థాయి అన్నమాట.  రెపో రేటు తగ్గింపు వల్ల ఈ రేటుతో అనుసంధానమైన గృహ, వాహన, వ్యక్తిగత రుణ రేట్లు దిగివస్తాయి. పరిశ్రమలకు కూడా వడ్డీరేట్ల భారం తగ్గుతుంది.

బ్యాంకులు డిపాజిట్‌ చేస్తే వచ్చేది 4 శాతమే..
ఇక బ్యాంకులు తమ వద్ద ఉన్న మిగులు నిధులను ఆర్‌బీఐ వద్ద ఉంచి పొందే వడ్డీరేటు రివర్స్‌ రెపోను ఏకంగా 90 బేసిస్‌ పాయింట్లు ఆర్‌బీఐ తగ్గించింది. దీనితో ఈ రేటు 4 శాతానికి దిగివచ్చింది. తమ ఫండ్స్‌ను ఆర్‌బీఐ వద్ద ఉంచడం వల్ల వచ్చే వడ్డీ మరీ తక్కువగా ఉండడం వల్ల, ఈ మేరకు నిర్ణయం విషయంలో బ్యాంకులను కొంత వెనక్కు తగ్గేలా చేసి, మార్కెట్‌లోనే వడ్డీకి ఇచ్చేలా వాటిని ప్రోత్సహించడం ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ లక్ష్యం.  

► అయితే ఆర్థిక మందగమనం పరిస్థితుల్లో, మొండిబకాయిలు తీవ్రమైన పరిస్థితుల్లో నిధులను బయటకు వడ్డీకి ఇచ్చి ఇబ్బందులుపడే బదులు, వాటిని ఆర్‌బీఐ వద్దే ఉంచి స్వల్ప వడ్డీనైనా పొందడం మంచిదని బ్యాంకులు భావిస్తుంటాయని నిపుణుల విశ్లేషణ.  

సీఆర్‌ఆర్‌ ఏకంగా ఒకశాతం
ఇక నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని ఆర్‌బీఐ ఏకంగా ఒకశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 3 శాతానికి దిగివచ్చింది. బ్యాంకులు తమ డిపాజిట్లలో కొత్త మొత్తాన్ని తప్పనిసరిగా నగదు రూపంలో ఆర్‌బీఐ వద్ద ఉంచాలి. దీనిపై ఆర్‌బీఐ ఎటువంటి వడ్డీ ఇవ్వదు. ఈ రేటు తగ్గింపు వల్ల బ్యాంకుల వద్ద అదనపు నిధుల లభ్యత ఉంటుంది. ఆర్‌బీఐ సీఆర్‌ఆర్‌ను తగ్గించడం ఏడు సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి.  

వ్యవస్థలోకి నిధులు ఎలా..?
ఇక ఆర్‌బీఐ తీసుకున్న పలు నిర్ణయాల వల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థకు రూ.3.74 లక్షల కోట్ల ద్రవ్య లభ్యత– లిక్విడిటీ (2019–20 జీడీపీ అంచనాల్లో దాదాపు 2 శాతం) అందుబాటులోకి రానుంది.  ఇందులో రెపో ఆపరేషన్‌ వల్ల రూ. లక్ష కోట్లు వ్యవస్థలోకి వస్తాయి. సీఆర్‌ఆర్‌ ద్వారా ఫైనాన్షియల్‌ సిస్టమ్‌లోకి వచ్చే మొత్తం రూ.1.37 లక్షల కోట్లు.  

రుణాలపై 0.75% వడ్డీ కోత: ఎస్‌బీఐ
ఆర్‌బీఐ విధాన ప్రకటన నేపథ్యంలో– బ్యాంకి ంగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 75 బేసిస్‌ పాయింట్ల రెపో కోతనూ కస్టమర్‌కు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచీ బదలాయించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

ఎస్‌బీఐ నిర్ణయం నేపథ్యంలో ప్రస్తుత ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ అనుసంధాన వార్షిక రుణ  రేటు (ఈబీఆర్‌) ప్రస్తుత 7.8 శాతం నుంచి 7.05 శాతానికి తగ్గుతుంది. ఇక రెపో ఆధారిత రుణ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) 7.40 శాతం నుంచి 6.65 శాతానికి దిగివస్తుంది.  దీని ప్రకారం, 30 సంవత్సరాలకు సంబంధించి గృహ రుణ రేటు నెల ఈఎంఐపై లక్షకు రూ.52 తగ్గుతుందని ప్రకటన పేర్కొంది. నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)పై వచ్చే నెల్లో జరగనున్న బ్యాంక్‌ అసెట్‌ లయబిలిటీ కమిటీ (ఏఎల్‌సీఓ) ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.   

డిపాజిట్‌ రేట్లూ తగ్గింపు
అన్ని కాలపరిమితుల రిటైల్, బల్క్‌ డిపాజిట్‌ రేట్లనూ 20 నుంచి 100 బేసిస్‌ పాయింట్ల శ్రేణిలో తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. రిటైల్‌ డిపాజిట్‌పై రేటు 20 బేసిస్‌ పాయింట్ల నుంచి 50 బేసిస్‌ పాయింట్లు తగ్గితే, బల్క్‌ డిపాజిట్‌పై రేటు 50 నుంచి 100 బేసిస్‌ పాయింట్లు తగ్గింది.  

ఏయే రుణాలపై మారటోరియం...  
క్రెడిట్‌ కార్డ్‌ చెల్లింపులు సహా టర్మ్‌ లోన్లపై (వ్యవసాయ, గృహ, విద్య, వ్యక్తిగత, వాహన) నెలవారీ చెల్లింపు(ఈఎంఐ)లకు సంబంధించి కస్టమర్లకు పెద్ద వెసులుబాటును ఆర్‌బీఐ కల్పించింది. ఈ రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం నిర్ణయం తీసుకోడానికి ఆర్థిక సంస్థలకు వెసులుబాటు ఇచ్చింది.  మారటోరియం సమయాన్ని డిఫాల్ట్‌గా, మొండిబకాయిగా పరిగణించడానికి వీలు పడదు. ‘‘మార్చి నుంచి మే  మధ్య అన్ని రుణ చెల్లింపులపై మారటోరియం అమల్లో ఉంటుంది. క్రెడిట్‌ కార్డ్‌ బకాయిలు సహా రిటైల్, కార్పొరేట్‌ రుణాలకు సంబంధించి అన్ని విభాగాలకూ ఇది వర్తిస్తుంది.

అసలు, వడ్డీ, మొత్తం బకాయి చెల్లింపులు, ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డు బకాయిలు అన్నింటికీ మారటోరియం వర్తిస్తుంది’’ అని ఆర్‌బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. మారటోరియం తర్వాత  టర్మ్‌ లోన్లకు సంబంధించి రుణ చెల్లింపుల షెడ్యూల్‌ మూడు నెలలు పెరుగుతుంది. ఉదాహరణకు మీరు ఒక రుణానికి సంబంధించి 2022 మార్చి 31లోపు అన్ని ఈఎంఐలు చెల్లించాల్సి ఉందనుకుందాం. ఆ షెడ్యూల్‌ ఇప్పుడు 2022 జూన్‌ 30 వరకూ పొడిగించడం జరుగుతుంది. అన్ని కమర్షియల్‌ బ్యాంక్‌లు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, లోకల్‌ ఏరియా బ్యాంకులుసహా) సహకార బ్యాంకులు, ఆల్‌ ఇండియా ఫైనాన్షియల్‌ సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీల రుణ చెల్లింపులు అన్నింటికీ ఈ మారటోరియం వర్తిస్తుంది.    

► వ్యాపార సంస్థలు తీసుకున్న వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలపై చెల్లించాల్సిన వడ్డీకి వెసులుబాటు లభిస్తుంది. ఈ కాలానికి పోగుపడే వడ్డీని మారటోరియం పూర్తయ్యాక కట్టాల్సి ఉంటుంది.  
► మారటోరియం విధివిధానాలపై బ్యాంకులే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.   
► ఒక రకంగా ఇది రుణాల చెల్లింపు కాస్త వాయిదా పడటమే తప్ప తర్వాతైనా కచ్చితంగా కట్టాల్సిందే. ఆయా బ్యాంకుల నిబంధనలు బట్టి ఈఎంఐ కాలవ్యవధి పెరగవచ్చు లేదా మారటోరియం వ్యవధిలో కట్టాల్సి వడ్డీని మిగిలిన టర్మ్‌లో కొద్ది కొద్దిగా కట్టేలా సర్దుబాటు చేయొచ్చు. దీనిపై బ్యాంకులు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.  

క్రెడిట్‌ కార్డు బాకీల పరిస్థితేంటి...
క్రెడిట్‌ కార్డు బాకీలు, ఈఎంఐలకు కూడా మూడు నెలల మారటోరియం వర్తిస్తుందని ఆర్‌బీఐ స్పష్టతనిచ్చింది. ఆ మేరకు బాకీలను మూడు నెలల తర్వాత కట్టవచ్చు. అయితే, ఈ మొత్తం సమయానికి అసలుపై వడ్డీ భారం పడుతూనే ఉంటుంది. ఉదాహరణకు అసలు కట్టాల్సినది రూ. 10,000 అయితే, వాయిదాపడిన మొదటి నెలలో దీనిపై వడ్డీ లెక్కిస్తారు. దీనికి పన్నులు అదనం. అలాగే, రెండో నెలలో అసలు, వడ్డీ మీద కలిపి అదనంగా వడ్డీ, పన్నులు ఉంటాయి. మూడో నెలా ఇదే రిపీట్‌ అవుతుంది. ఇక నాలుగో నెలలో మాత్రం (మారటోరియం తర్వాత) అప్పటిదాకా పేరుకుపోయిన బాకాయి మొత్తాన్ని వడ్డీ, పన్నులతో సహా ఒకేసారి చెల్లించాల్సి రావడంతో తడిసి మోపెడవుతుంది.

రేటు తగ్గిస్తే ఏంటి ప్రయోజనం... 
గృహ, వాహన, వ్యక్తిగత రుణాల్లాంటి టర్మ్‌ లోన్స్‌ గ్రహీతలకు రేట్ల కోతతో ప్రయోజనం లభిస్తుంది. ఆర్‌బీఐ పాలసీకి అనుగుణంగా బ్యాంకులు కూడా రేటు తగ్గిస్తే .. రుణాలు చౌకగా మారతాయి. ఎలాగంటే..   
► రిజర్వ్‌ బ్యాంక్‌ 75 బేసిస్‌ పాయింట్లు (ఒక బేసిస్‌ పాయింట్‌ అంటే 0.01 శాతం) తగ్గించింది. దీనితో రెపో–రేటు అనుసంధానిత గృహ రుణం తీసుకున్నవారికి... గణనీయంగా వడ్డీ రేటు భారం తగ్గవచ్చు. ఉదాహరణకు 8 శాతం వార్షిక వడ్డీ రేటుపై రూ. 50 లక్షలు తీసుకున్న వారి ఈఎంఐ భారం దాదాపు రూ. 2,139 మేర తగ్గవచ్చు. అయితే, ఎస్‌బీఐ ఇప్పటికే 0.75 శాతం రుణ రేటు తగ్గించిన నేపథ్యంలో మిగతా బ్యాంకులూ దీన్నే అనుసరించే చాన్స్‌ ఉంది.  

► సాధారణంగా 2019 అక్టోబర్‌ 1 తర్వాత నుంచి రెపో రేటు ప్రాతిపదికనే బ్యాంకులు ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలు ఇస్తున్నాయి. కాబట్టి కచ్చితంగా ఆర్‌బీఐ తగ్గించిన మేరకు ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బ్యాంకులు బదలాయించాల్సి ఉంటుంది. గతంలో మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌(ఎంసీఎల్‌ఆర్‌) ఆధారిత వడ్డీ రేటుపై రుణాలు తీసుకున్న వారికి కూడా కొంత మేర తగ్గుతుంది. ఒక వేళ పూర్తి ప్రయోజనాలు దక్కని పక్షంలో.. కాస్త వన్‌ టైమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి వచ్చినా.. రెపో రేటు ఆధారిత గృహ రుణాలకు మారడం శ్రేయస్కరం. బ్యాంకులు తగ్గిస్తాయి కాబట్టి... వాటితో పోటీ పడేందుకైనా హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలూ(హెచ్‌ఎఫ్‌సీ) తగ్గించే అవకాశాలు ఉంటాయి.

ఇంతకీ మారటోరియం అంటే..
సంక్షోభ సమయంలో రుణ గ్రహీతలకు కాస్త ఊరటనిచ్చేందుకు ఉద్దేశించినది మారటోరియం. కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయే అవకాశం ఉంది. దీంతో రుణాలు తీసుకున్న వారు ఈఎంఐలు చెల్లించడం కష్టంగా మారవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆర్‌బీఐ తాత్కాలికంగా ఈఎంఐల చెల్లింపు విషయంలో వ్యవధిపరంగా 3 నెలలు వెసులుబాటునిస్తూ మారటోరియం ప్రకటించింది. దీనితో మే నెల దాకా ఈఎంఐ కట్టకపోయినా.. బ్యాంకు మిమ్మల్ని ఎగవేతదారుగా పరిగణించ బోదు. మీ క్రెడిట్‌ స్కోరుకు నష్టం లేదు.

ఆర్థికం అనిశ్చితే... అయినా పటిష్టం..
2019–20 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుంది. జనవరి–మార్చి త్రైమాసికంలో ఈ రేటు 4.7 శాతంగా నమోదయ్యే వీలుంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే క్రూడ్‌ ఆయిల్‌ ధరల పతనం ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరటనిచ్చే అంశం. తీసుకుంటున్న ద్రవ్య పరపతి చర్యల సానుకూల ప్రభావం, కరోనా కట్టడి వంటి అంశాలు భవిష్యత్‌తో దేశాభివృద్ధికి మార్గదర్శకాలుగా ఉంటాయి. రికార్డు స్థాయి ఆహార ఉత్పత్తుల వల్ల ఆహార ధరలు అదుపులోనే ఉంటాయి.

అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం అవుట్‌లుక్‌లపై ఎటువంటి అంచనాలనూ చెప్పలేం. అనిశ్చితి పరిస్థితులే దీనికి కారణం.  ఇక ఆర్‌బీఐ తీసుకునే అన్చి చర్యలకూ  ఆర్థిక పటిష్టత, వృద్ధి పునరుద్ధరణే లక్ష్యం. భారత్‌లో బ్యాంకింగ్‌ వ్యవస్థ సురక్షితం. ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్‌లు భద్రం. బ్యాంకుల నుంచి భయాందోళనలతో కూడిన నిధుల ఉపసంహరణ (విత్‌డ్రాయెల్స్‌) అవసరం లేదు.  2008 ఫైనాన్షియల్‌ మార్కెట్‌ సంక్షోభ పరిస్థితులతో పోల్చితే ప్రస్తుత భారత స్థూల ఆర్థిక  మూలాలు పటిష్టంగా ఉన్నాయి.
– శక్తికాంత దాస్, ఆర్‌బీఐ గవర్నర్‌  
 

ఆర్థిక వ్యవస్థకు రక్షణ
ఆర్‌బీఐ చర్యలు కరోనావైరస్‌ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థకు రక్షణ కల్పిస్తాయి. వ్యవస్థలో ద్రవ్య లభ్యతను పెంచుతాయి. నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయి. మధ్య తరగతి ప్రజలు, వ్యాపారులకు ఆర్‌బీఐ నిర్ణయాలు సహకరిస్తాయి.      

– నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

తక్షణ బదలాయింపు జరగాలి
ఆర్‌బీఐ రెపోరేటు తగ్గింపు ద్వారా తమకు ఒనగూరిన ప్రయోజనాన్ని బ్యాంకులు తక్షణం కస్టమర్‌కు బదలాయించాలి. భారత్‌ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్న గవర్నర్‌ ప్రకటన హర్షణీయం. బకాయిల చెల్లింపుపై మారటోరియం పెద్ద ఊరట.

– నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి

మానవీయ దృక్పధం
ఆర్థిక వ్యవస్థ రక్షణలో మానవీయ దృక్పధంతో కూడిన సాహసోపేత, హర్షణీయ నిర్ణయాలను ఆర్‌బీఐ తీసుకుంది. ఎస్‌బీఐకి సంబంధించి రూ.60,000 కోట్ల వరకూ రుణ మారటోరియం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.

– రజనీష్‌ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్‌  
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు