రాజన్ చివరి సారిగా మెరిపిస్తారా...?

9 Aug, 2016 00:38 IST|Sakshi
రాజన్ చివరి సారిగా మెరిపిస్తారా...?

నేడు ద్రవ్య విధాన పరపతి సమీక్ష
రాజన్‌కు గవర్నర్ హోదాలో ఇదే చివరిది
రేట్ల తగ్గింపు ఉండొచ్చని అంచనాలు

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా రఘురామ్ రాజన్ తన చిట్టచివరి ద్రవ్య, విధాన పరపతి సమీక్షా సమావేశంలో మెరుపులు మెరిపిస్తారా...? వెళుతూ వెళుతూ రేట్లను కోసేసి పారిశ్రామిక, బ్యాంకింగ్, మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తారా..? చాలామంది ఇలాగే ఆలోచిస్తుండటంతో ఇప్పుడు అందరి కళ్లూ మంగళవారం నాటి పరపతి విధాన సమీక్షపైనే పడ్డాయి.

సెప్టెంబర్ 4న ఆర్‌బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న రాజన్‌కు ఇదే చివరి పరపతి విధాన సమీక్షా సమావేశం. రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే కొనసాగుతున్నందున ఆర్‌బీఐ రేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కానీ, అధిక వడ్డీ రేట్లను కొనసాగిస్తున్నారన్న విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజన్ కీలక రేట్లలో మార్పులు చేసే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. తదుపరి సమీక్షా సమావేశం అక్టోబర్ 4న జరగనుంది. వడ్డీ రేట్ల నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ పేరుతో కొత్త విధానాన్ని కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

 రేట్ల కోతకు మూడు కారణాలు
ఆర్‌బీఐ 0.25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించడానికి అవకాశాలున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా - మెరిల్‌లించ్ బ్రోకరేజీ సంస్థ తెలిపింది. ఇందుకు మూడు కారణాలు పేర్కొంది. ‘1. రాజన్‌కు ఇదే చివరి సమీక్ష. కనుక తన కఠిన విధానాన్ని విడిచిపెట్టవచ్చు. 2. జూన్‌లో 5.7 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం... మంచి వర్షాలు పడితే ఆహార ద్రవ్యోల్బణం తగ్గి ఫలితంగా మార్చి నాటికి 5.1 శాతానికి తగ్గుతుంది. అదే సమయంలో జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి పెరగొచ్చు. 3. అధిక వడ్డీ రేట్లు రుణాల గిరాకీని తగ్గించడం ద్వారా ఆర్థిక రికవరీపై ప్రభావం చూపుతుంది. అధిక వడ్డీ రేట్ల వల్ల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)లు కూడా అధికం అవుతాయి. రుణాలకు గిరాకీ పెరిగే సమయంలో రేట్లను తగ్గించడం మంచిది’ అని సంస్థ తన నివేదికలో పేర్కొంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపును వాయిదా వేస్తుందన్న దానికి కారణంగా లోగడ చెప్పారని, ప్రస్తుతం ఫెడ్ వడ్డీ రేట్ల కోత కూడా వాయిదా పడిన విషయాన్ని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్ గుర్తు చేసింది.

 అవకాశం లేదు!!
కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చు. ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలలో 5.7శాతానికి పెరగడంతోపాటు జూలై, ఆగస్టు నెలల్లోనూ అధిక స్థాయిల్లోనే కొనసాగవచ్చు. తదుపరి వడ్డీ రేట్లలో కోత అన్నది ద్రవ్యోల్బణం తీరు, మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటుపైనే ఆధారపడి ఉంది. - డీబీఎస్

50 పాయింట్ల మేర కోత
బ్రిటన్ సహా చాలా దేశాల్లో రేట్లు తగ్గుముఖం పట్టాయి. స్థూల ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నందున ఆర్‌బీఐ 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లలో కోత విధించవచ్చు. - రాణా కపూర్, ఎండీ, యస్‌బ్యాంక్

 రేట్ల కోతకు అవకాశం లేదు
రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 5.77 శాతానికి చేరింది. 22నెలల్లో ఇంత వేగంగా పెరగడం ఇదే ప్రథమం. జీఎస్‌టీ అమలుతో ఇది మరింత పెరిగే వకాశం ఉంది. కనుక వడ్డీ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చు.  - అరుంధతీ భట్టాచార్య, చైర్ పర్సన్, ఎస్‌బీఐ

విభేదాలతో మంచే జరుగుతుంది: సుబ్బారావు
బెంగళూరు: ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలతో నష్టం లేదని, పైగా విధానాల మెరుగునకు ఉపకరిస్తుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ‘కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండూ తమ అభిప్రాయాలకు కట్టుబడి ఉండాలి. వారి వైపు నుంచి చూస్తే ఇదేమీ తప్పు కాదు. వాస్తవానికి ప్రజా విధానాల మెరుగునకు ఇవి దోహదం చేస్తాయి’ అని సుబ్బారావు ఒక వార్తా సంస్థతో చెప్పారు.

గతంలో గవర్నర్‌గా పనిచేసిన సమయంలో సుబ్బారావుకు, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరంతో... ప్రస్తుత గవర్నర్ రాజన్‌కు ఆర్థిక మంత్రి జైట్లీతో ఉన్న విభేదాలపై ప్రశ్నించినప్పుడు ఈ సమాధానం వచ్చింది. అయితే, ఈ భిన్నాభిప్రాయాలను కొనసాగించేందుకు తగిన ఏర్పాట్లు, విధి విధానాలు ఉండాలన్నారు. విభేదాలు నాలుగు గోడలకే పరిమితం కావాలని, ఫైనాన్షియల్ మార్కెట్లను, ఈ రంగ నిపుణులను అయోమయానికి గురి చేయరాదని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు