ద్రవ్యలోటు కట్టడి కష్టమే 

28 Apr, 2020 07:55 IST|Sakshi

ముంబై : కరోనా వైరస్‌ సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది ద్రవ్య లోటు కట్టడి లక్ష్యాలు అధిగమించడం కష్టసాధ్యమేనని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా జీఎస్‌టీ, ప్రత్యక్ష పన్ను వసూళ్లపైనా ప్రభావం పడొచ్చని వార్తాసంస్థ కోజెన్సిస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఇంటర్వ్యూలోని కొన్ని విశేషాలు.. 

ఎకానమీపై కరోనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకోతగిన చర్యలేంటి? 
ఆర్థిక ఉద్దీపనల కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు ప్యాకేజీలపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఇప్పటికే వెల్లడించారు. కరోనా వేళ బడుగు వర్గాల కోసం ప్రభుత్వం పలు సహాయక చర్యలు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల దరిమిలా ద్రవ్య లోటును 3.5 శాతానికి పరిమితం చేయాలని నిర్దేశించుకున్న లక్ష్యం కష్టసాధ్యమే. ద్రవ్య లోటు కచ్చితంగా దాటేయొచ్చు. ఇక లాక్‌డౌన్‌ కారణంగా జీఎస్‌టీ వసూళ్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది. ప్రత్యక్ష పన్నులపైనా ప్రభావాన్ని తోసిపుచ్చలేం. ఏదేమైనా కరోనా సవాళ్లను ఎదుర్కొనడంతో పాటు ద్రవ్య లోటును కట్టడి చేసేలా ప్రభుత్వం సమతూకమైన నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నాను. 

ద్రవ్య లోటు భర్తీలో ఆర్‌బీఐ ఏమైనా తోడ్పాటు అందించబోతోందా? 
ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ఇంకా ఏ అభిప్రాయమూ లేదు. అవసరం తలెత్తినప్పుడు స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తగు నిర్ణయం తీసుకుంటాం. ఈ క్రమంలో నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలిస్తాం. 

2008, 2020 సంక్షోభాలను చూసినప్పుడు ఎకానమీని పట్టాలెక్కించడంలో ఆర్‌బీఐ పాత్ర పరిమితంగానే ఉంటోందనే భావనపై మీ అభిప్రాయమేంటి? 
కేంద్రీయ బ్యాంకు పాత్రను తక్కువగా చేసి చూడటానికి లేదు. ద్రవ్య పరపతి విధానం, లిక్విడిటీ నిర్వహణ, ఆర్థిక రంగ నియంత్రణ.. పర్యవేక్షణ మొదలైనవన్నీ చాలా శక్తిమంతమైన సాధనాలే. ఆర్థిక పరిస్థితులపై దీర్ఘకాల ప్రభావాలు చూపేవే. ప్రస్తుతం ఒక మహమ్మారిపరమైన మందగమనంతో పోరాడుతున్నాం. దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని వర్గాలు కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉంటుంది. సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ప్రభుత్వం చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. 

ఉదార ఆర్థిక విధానాల చక్రవ్యూహం నుంచి బైటపడే మార్గమేంటి? 
ఇలాంటి అంశాల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌కి సంబంధించి సమయోచిత మార్గదర్శక ప్రణాళిక ఉండాలి. ద్రవ్య లోటు కావొచ్చు లేదా లిక్విడిటీ కావొచ్చు లేదా అసాధారణ చర్యలేవైనా కావొచ్చు.. చక్రవ్యూహంలోకి ప్రవేశించడం, బైటపడటం గురించి ఏకకాలంలో వ్యూహాలు రచించుకోవాలి. ఇదంతా చూసి.. ఆర్‌బీఐ కఠినతర విధానాన్ని పాటించబోతోందని మార్కెట్లు భావించకుండా ఒక విషయం స్పష్టం చేయదల్చుకున్నాను. పరిస్థితులు దాదాపుగా సాధారణ స్థాయికి వచ్చాయని, చక్కబడ్డాయని భరోసా కలిగినప్పుడు మాత్రమే సమయోచితంగా ఎగ్జిట్‌ ఉండాలి. మరీ ముందుగానో.. మరీ ఆలస్యంగానో ఉండకూడదు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జిట్‌ విషయమొక్కటే కాదు.. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా కష్టమే. అసాధారణ పరి స్థితుల్లో అసాధారణ చర్యలు తీసుకోవాల్సిందే. 

మరిన్ని వార్తలు