ముందే నోట్ల స్టాక్ ను రెడీగా పెట్టాం: ఉర్జిత్

27 Apr, 2017 20:40 IST|Sakshi
ముందే నోట్ల స్టాక్ ను రెడీగా పెట్టాం: ఉర్జిత్
న్యూఢిల్లీ : నోట్ల రద్దుపై ఇప్పటికీ చాలానే అంతు తోచని ప్రశ్నలు ప్రజల మదిలో ఉన్నాయి. అంత సీక్రెసీగా నిర్ణయం ఎలా తీసుకున్నారు? కొత్త నోట్లను వెంటనే ఎలా విడుదల చేశారు? ఉర్జిత్ పటేల్ కు ముందున్న రిజర్వు బ్యాంకు గవర్నర్ రాజన్ ఈ ప్రక్రియకు ఆమోదం తెలిపారా? అనే ప్రశ్నలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. అయితే డీమానిటైజేషన్ కు ముందే అవసరమయ్యే కొత్త 500, 2000 నోట్లను తయారుచేసి రెడీగా పెట్టామని రిజర్వు బ్యాంకు గవర్నర్  ఉర్జిత్ పటేల్ తెలిపారు. డీమానిటైజేషన్ విషయాన్ని సీక్రెట్ గా ఉంచడానికి ఆర్బీఐకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలను రికార్డుల రూపంలో పొందుపరచలేదని ఉర్జిత్ పటేల్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్రజల అసౌకర్యాలను తొలగించామని చెప్పారు. ప్రింటింగ్ సామర్థ్యాన్ని పెంచడం, ఇతర వనరులు బ్యాంకు నోట్ పేపర్, ఇంక్, లాజిస్టిక్స్ అవసరాలు వంటి వాటి విషయంలో ఎప్పడికప్పుడూ ప్రభుత్వంతో చర్చలు జరిపామని లిఖిత పూర్వకంగా తన సమాధాన్ని అందించారు.
 
ఈ కీలక అంశాలన్నింటిన్నీ పరిగణలోకి తీసుకుని డీమానిటైజేషన్ కు కొన్ని నెలల ముందే కొత్త 2000, 500 నోట్ల ముద్రించే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించినప్పుడు తమ దగ్గర సహేతుకమైన కొత్త నోట్లు ప్రింట్ అయి, సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆర్బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఉన్నప్పటి నుంచే అంటే 2016 ప్రారంభం నుంచే పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ గురించి సెంట్రల్ బ్యాంకు, ప్రభుత్వం మధ్య చర్చలు ప్రారంభమయ్యాయని పటేల్ తెలిపారు. అయితే డీమానిటైజేషన్ కు సంబంధించి రాజన్ కు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల మినిట్స్ రికార్డుల్లో లేవన్నారు.     
 
మరిన్ని వార్తలు