ఇక రోజంతా రూపీ ట్రేడింగ్‌

8 Jan, 2020 01:46 IST|Sakshi

బ్యాంకులకు ఆర్‌బీఐ గ్రీన్‌సిగ్నల్‌

ఎక్స్చేంజిలోనూ వేళలు పొడిగింపు!

ముంబై: దేశీయంగా రూపాయి ట్రేడింగ్‌ సేవలు ఇకపై 24 గంటలూ అందుబాటులో ఉండేలా రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రోజంతా దేశీ కరెన్సీ ట్రేడింగ్‌ సేవలు అందించడానికి దేశీ బ్యాంకులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూపాయి ట్రేడింగ్‌ పరిమాణం భారత్‌లో కన్నా విదేశాల్లో గణనీయంగా జరుగుతుండటం, ఇక్కడ ట్రేడింగ్‌ వేళలు పరిమితంగా ఉండటం వల్ల అంతర్జాతీయ పరిణామాలను దేశీ మార్కెట్లు వెంటనే అందిపుచ్చుకోలేక ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

దేశీ మార్కెట్‌ వేళల తర్వాత కూడా అధీకృత డీలర్లు ఇంటర్‌–బ్యాంక్‌ లావాదేవీలను నిర్వహించవచ్చని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆర్‌బీఐ ఆదేశాలు ఓవర్‌–ది–కౌంటర్‌ మార్కెట్‌ లావాదేవీలకే పరిమితమైనా.. అటు ఎక్సే్ఛంజీల్లో కూడా కరెన్సీ ట్రేడింగ్‌ వేళలను పొడిగించేందుకు బాటలు వేసే అవకాశముంది. అయితే, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది.  వాస్తవానికి కరెన్సీ ట్రేడింగ్‌ వేళలు పొడిగించాలన్న డిమాండ్‌ చాన్నాళ్లుగానే ఉంది. దేశీయంగా కన్నా ఇతరత్రా కొన్ని దేశాల్లో రూపాయి ట్రేడింగ్‌ భారీగా ఉంటుండటమే ఇందుకు కారణం.  రూపాయి ట్రేడింగ్‌కు సంబంధించి 2019 సెప్టెంబర్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్మెంట్స్‌ విడుదల చేసిన గణాంకాలు ఇందుకు ఊతమిస్తున్నాయి.

మరిన్ని వార్తలు