చమురు చిక్కులకు.. డాలర్లతో చెక్‌!

8 Jan, 2020 01:36 IST|Sakshi

ఆరేళ్లలో ఆర్‌బీఐ కొన్న డాలర్లు 176 బిలియన్లు

ప్రస్తుతం ఫారెక్స్‌ నిల్వలు 457.5 బిలియన్‌ డాలర్లు

2019లో ఒకే ఏడాది 64 బిలియన్‌ డాలర్ల పెరుగుదల

ప్రస్తుత నిధులతో 10 నెలల దిగుమతి అవసరాలు ఓకే

అంతర్జాతీయ అనిశ్చితికి డాలర్ల రక్షణ

ఆసియాలో అధికంగా డాలర్లను కొన్నది ఆర్‌బీఐనే

డాలర్ల సమీకరణలో భారత్‌ తర్వాత కొరియా, తైవాన్‌  

చమురు బావుల ప్రధాన కేంద్రం పశ్చిమాసియాలో అమెరికా– ఇరాన్‌ ప్రతీకార చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇటీవలి కాలంలో ఉన్న ధరలతో చూస్తే బ్యారెల్‌కు 5 డాలర్ల వరకు పెరిగాయి. చమురును అత్యధికంగా వినియోగిస్తూ, వినియోగంలో 80%కి పైగా దిగుమతి చేసుకుంటున్న మన ఆర్థిక వ్యవస్థకు ఈ ధరల పెరుగుదల పెద్ద ఇబ్బందే. అయితే, ఆర్‌బీఐ ముందుచూపు మన ఆర్థిక వ్యవస్థ చమురు ప్రకంపనల నుంచి తట్టుకునేలా దృఢంగా నిలిపిందని చెప్పుకోవాలి.

ఎందుకంటే మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు గత డిసెంబర్‌ 27వ తేదీ నాటికి 457.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి. గతేడాది (2019లో) ఆర్‌బీఐ భారీ ఎత్తున డాలర్లను కొనుగోలు చేసింది. ఫలితంగా 64 బిలియన్‌ డాలర్ల మేర ఫారెక్స్‌ నిల్వలు 2019లో (డిసెంబర్‌ 27 నాటికి) పెరిగాయి. ఆసియాలోని ఇతర దేశాల్లో మరే కేంద్ర బ్యాంకు ఈ స్థాయిలో డాలర్ల కొనుగోళ్లకు దిగకపోవటాన్ని ఇక్కడ గమనించాలి. మనం చమురు దిగుమతులను అధిక శాతం డాలర్ల రూపంలోనే చేసుకుంటున్నందున... దండిగా ఉన్న డాలర్‌ నిల్వలు ఈ సమయంలో మనకు కలసిరానున్నాయి. 2019లో తైవాన్‌ 15 బిలియన్‌ డాలర్లు, థాయిలాండ్‌ 14 బిలియన్‌ డాలర్ల చొప్పున కొన్నాయి. ఇక ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేసియా, దక్షిణ కొరియా ఇంకా తక్కువ మొత్తంలోనే కొనుగోలు చేయడం గమనార్హం.  

ఆరేళ్లలో 176 బిలియన్‌ డాలర్లు 
ఆర్‌బీఐ డాలర్ల కొనుగోళ్ల తీరును సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ గ్రూపు అధ్యయనం చేసింది. దీని ప్రకారం.. 2013 ఆగస్ట్‌ ట్యాపర్‌ టాంటమ్‌ (యూఎస్‌ ఫెడ్‌ పరిమాణాత్మక ద్రవ్య సడలింపు విధానం నుంచి వెనక్కి మళ్లడం) తర్వాత నుంచి భారత రిజర్వ్‌ బ్యాంకు మొత్తం మీద 176 బిలియన్‌ డాలర్ల మేర ఫారెక్స్‌ నిల్వలను పెంచుకుంది. పరిమాణాత్మక సడలింపు విషయంలో నిదానంగా వ్యవహరించనున్నట్టు నాడు యూఎస్‌ ఫెడ్‌ చేసిన ప్రకటనకు అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ కఠినంగా మారడంతో వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం అధికమైంది. ఈ ఆరేళ్ల కాలంలో ఫారెక్స్‌ నిల్వల విషయంలో దక్షిణ కొరియా 76 బిలియన్‌ డాలర్లను పెంచుకుని రెండో స్థానంలో, తైవాన్‌ 65 బిలియన్‌ డాలర్ల ఫారెక్స్‌ నిల్వలను పెంచుకుని మూడో స్థానంలో ఉన్నాయి.  

10 నెలల వరకూ ఓకే..! 
ప్రస్తుతం ఆర్‌బీఐ వద్దనున్న ఫారెక్స్‌ నిల్వలు పది నెలల దిగుమతుల అవసరాలను తీర్చగలవు. తాజా అంతర్జాతీయ అనిశ్చితిలో రూపాయి విలువను కాపాడేందుకు ఈ నిల్వలు ఆర్‌బీఐకి ఆయుధంగా పనిచేస్తాయనేది నిపుణుల మాట. అంతర్జాతీయ అనిశ్చితుల నుంచి బలమైన నిల్వల ఏర్పాటు దిశగా అధికార యంత్రాంగం వేగంగా వ్యవహరిస్తున్నట్టు డీబీఎస్‌లోని భారత ఆర్థిక వేత్త రాధికా రావు తెలిపారు. స్వల్పకాలిక నిధుల రాక, ఎక్స్‌టర్నల్‌ రుణాల రూపేణా వచ్చే ఒత్తిళ్లను తట్టుకునేందుకు ఈ నిల్వలు ఉపకరిస్తాయన్నారు. అయితే, నాణేనికి మరోవైపు అన్నట్టు.. పెరిగిన డాలర్‌ నిల్వలు రూపాయి మారకంపై ప్రభావం చూపించొచ్చనని చెప్పారామె. 

మరిన్ని వార్తలు