రెపో షాక్‌: ఆ రుణాలు ఇక భారమే

6 Jun, 2018 16:12 IST|Sakshi

సాక్షి,ముంబై: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ సమీక్షలో బుధవారం కీలక  నిర్ణయాన్ని ప్రకటించింది. గత నాలుగేళ్లలో,  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన అనంతరం తొలిసారి  రెపో రేటును  పెంచుతూ  నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే 2016 జూన్‌ లో మానిటరీ పాలసీ ఏర్పడినప్పటి నుంచీ  రెపో రేటుపెంచడం ఇదే మొదటిసారి. రెపో రేట్‌ను  25 బేసిస్ పాయింట్ల మేర పెంచి దీన్ని 6.25 శాతంగా నిర్ణయించింది. దీనితోపాటు రివర్స్‌ రెపోను సైతం 0.25 శాతం పెంచి 6 శాతానికి చేర్చింది. ఆర్‌బీఐ ఎంపిసి సభ్యులందరూ రేట్ల పెంపునకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో సామాన్య వినియోగదారుడి నెత్తిన రుణ పిడుగు పడగనుంది. కీలక వడ్డీ రేట్ల పెంపుతో  గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత  భారం కానున్నాయి. 

సాధారణ రెండు రోజులకు బదులుగా ఈసారి మూడు రోజులపాటు ఆర్‌బీఐ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల పెంపునకే మొగ్గు చూపింది. ముడి చమురు ధరల పెరుగుదల, సీపీఐ బలపడుతుండటం వంటి ప్రతికూల అంశాల నడుమ పావు శాతం రెపో రేటు పెంపునకు నిర‍్ణయించామని  ఉర్జిత్‌  ప్రకటించారు.  ఈ బెంచ్‌మార్క్ రేట్లను చివరిసారి జనవరి 2014 లో పెంచారు. రిపో రేటు పెరుగుదల బ్యాంకుల నుంచి  రుణాలను తీసునేవారికి బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పవచ్చు.  రెపో రేటు పెంపుతో  ఆయా బ్యాంకులు రుణాలపై వడ్డీ పెంచడం ఖాయం. ముఖ్యంగా గృహ రుణ, కారు లేదా, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటును పెంచుతాయి.  

రెపో, రివర్స్‌  రెపో రేటు అంటే?
ఆర్‌బీఐనుంచి బ్యాంకులు  తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీరేటు రెపో రేటు. బ్యాంకులు స్వల్పకాలానికి రిజర్వ్ బ్యాంక్‌ వద్ద డిపాజిట్‌ చేసే నిధులకు అందుకునే వడ్డీ రివర్స్‌ రెపో. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ నెలవారీ ద్రవ్య విధాన సమీక్షకు కొద్ది రోజుల ముందే దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఐసిఐసిఐ బ్యాంక్ , బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర బ్యాంకులు ఇప్పటికే రుణాలపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచేసిన సంగతి తెలిసిందే. 

ఇది ఆరంభం మాత్రమే
ఇది ఇలా ఉంటే  ఆర్‌బీఐ కీలక వడ్డీ రేటు పెంపు క్రమంలో ఇది ఆరంభమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎంపీసీ ప్రకటనకు ముందే  రెపో రేటు పెంపును  హెచ్ఎస్‌బీసీ గ్లోబల్ రీసెర్చ్ అంచనా వేసింది. అంతేకాదు 2018 ఆర్థిక సంవత్సరంలో రివర్స్‌, రెపో రేట్లపై 25 బేసిస్ పాయింట్లు పెంపు రెండుసార్లు వుంటుందని ఉంటుందని పేర్కొంది. ఇదే అభిప్రాయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా  ట్విటర్‌లో వెల్లడించింది. 

మరిన్ని వార్తలు