కోటక్‌ మహీంద్రకు ఆర్‌బీఐ షాక్‌

8 Jun, 2019 15:56 IST|Sakshi

కోటక్‌ మహీంద్రకు భారీ జరిమానా

ఆర్‌బీఐ మార్గదర్శకాలను పాటించనందుకుగాను రూ.2 కోట్ల పెనాల్టీ

సాక్షి,ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు కోటక్‌  మహీంద్రా బ్యాంకునకు ఆర్‌బీఐ గట్టి షాక్‌ ఇచ్చింది. ప్రమోటర్ల వాటాలను సంబంధించి  సరిమైన సమాచారం అందించలేదన్నకారణంగా భారీ పెనాల్టీ విధించింది.  రూ. 2 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

ప్రమోటార్ల వాటాల విలీనానికి సంబంధించి ఆర్‌బీఐ నిబంధనలను,  సూచనలను పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ వెల్లడించింది. దీంతో 2 కోట్ల రూపాయల  నగదు జరిమానా విధించామని పేర్కొంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని నిబంధనల ప్రకారం ఈ పెనాల్టీ అమలుచేస్తున్నట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.

బ్యాంక్‌లో ప్రమోటార్ల వాటా వివరాలను సమర్పించాల్సిందిగా ఇప్పటికే ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ మార్గదర్శకాలను అమలు చేయడంలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ విఫలమైందని, నిబంధనలు పాటించనందుకు ఎందుకు జరిమానా విధించకూడదో తెలియజేయాల్సిందిగా షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకు నుంచి వచ్చిన సమాధానాన్ని పరిశీలించిన తరువాతజరిమానా విధించేందుకు నిర్ణయించామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు