పీఎన్‌బీకి మరోసారి ఆర్‌బీఐ షాక్‌

3 Aug, 2019 16:30 IST|Sakshi

ఫ్రాడ్‌పై నివేదించడంలో ఆలస్యం రూ. 50 లక్షల జరిమానా

బీవోబీకి కూడా రూ.50 లక్షల పెనాల్టీ

సాక్షి, ముంబై : ప్రభుత్వ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి ఆర్‌బీఐ షాక్ ఇచ్చింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఖాతాలో మోసం జరిగినట్లు నివేదించడంలో ఆలస్యం చేసినందుకుగాను  రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  పీఎన్‌బీకి  రూ .50 లక్షల భారీ పెనాల్టీ విధించింది. ఈ విషయాన్ని శనివారం అందించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పీఎన్‌బీ  వెల్లడించింది.

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ ఖాతాకు సంబంధించి జూలై 10, 2018 న పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమర్పించిన ఫ్రాడ్‌ మానిటరీ రిపోర్ట్‌-1లో ఆలస్యాన్ని ఆర్‌బీఐ గుర్తించిందని తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 లోని వివిధ సెక్షన్ల  కింద బ్యాంకుపై ఈ  జరిమానా విధించింది. మరోవైపు  ఫ్రాడ్‌పై నివేదించడంలో జరిగిన ఆలస్యానికి గాను  ఆర్‌బీఐ రూ .50 లక్షల జరిమానా విధించినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక ప్రత్యేక దాఖలులో పేర్కొంది.

కాగా ఇటీవల కరెంట్ బ్యాంకు అకౌంట్ల విషయంలో అవసరమైన కెవైసీ  నిబంధనలను ఉల్లంఘించినందుకు నాలుగు బ్యాంకులపై ఆర్బీఐ పెనాల్టీ విధించింది. పీఎన్‌బీ, అలహాబాద్ బ్యాంకు, యూసీఓ బ్యాంకులకు ఒక్కోదానిపై రూ.50 లక్షలు జరిమానా విధించగా, కార్పొరేషన్ బ్యాంకుపై రూ.25 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు